ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు పెద్దలు. అయితే రాహుల్ గాంధీ తీరు మాత్రం విదేశాలకు వెళ్తే… దేశం గురించి నెగెటివ్‌గా మాట్లాడి వస్తూంటారు. దీనిపై విమర్శలు వస్తున్నా.. బీజేపీని వ్యతిరేకించేవారు తనను సమర్థిస్తారన్న అభిప్రాయంతో అవే మాటలు మాట్లాడుతున్నారు. తాజాగా అమెరికాలోనూ ఆయన దేశం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.
భారత ఎన్నికల వ్యవస్థపై అమెరికాలో చర్చ పెట్టిన రాహుల్
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ భారత ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టమని ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం నిజాయితీగా పని చేయడం లేదని ఆరోపించారు. మహారాష్ట్రలో సాయంత్రం 5:30 గంటలకు ఈసీఐ వెల్లడించిన ఓటింగ్ శాతానికి, ఆ తర్వాత 7:30 గంటల సమయానికి మధ్య దాదాపు 65 లక్షల ఓట్లు అదనంగా నమోదయ్యాయి. కేవలం రెండు గంటల్లో ఇన్ని ఓట్లు పోలవడం అసాధ్యమని ఆయన విశ్లేషించారు. వీడియోలు అడిగితే ఈసీ ఇవ్వలేదన్నారు. వీడియోగ్రఫీని అడిగే అవకాశం లేకుండా చట్టాన్ని మార్చిందని కూడా ఆయన ఆరోపించారు.
గతంలోనూ రెండు ఇండియాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
గతంలోనూ విదేశాల్లో పర్యటించినప్పుడు భారత్ గురించి చాలా చులకనగా ప్రసంగించేవారు. రెండు ఇండియాలు ఉన్నాయని చెప్పేవారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ భారతీయులతో మాట్లాడినా.. ఆయన దేశ ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన మాటలకు ప్రాధాన్యం వస్తుంది. అంతర్జాతీయ మీడియాలో ప్రసారం అవుతాయి. దీని వల్ల భారత్ ఇమేజ్ కే మరక పడుతుంది. భారతదేశంలో ఏమైనా సమస్యలు ఉంటే భారత్ లోనే పరిష్కరించుకోవాలి కానీ..ప్రపంచ దేశాల ముందు పెట్టడం అంటే.. దేశాన్ని అవమానించడమే. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో..సలహాదారుల సలహాలతో చేస్తున్నారు కానీ.. విదేశాల్లో ఆయన భారత్ ను కించపరుస్తున్నారు.
ఎన్ని విమర్శలు వచ్చినా అదే తీరు !
రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రపంచదేశాలు సీరియస్ గా తీసుకుంటే.. భారత్ లో ప్రజాస్వామ్యం బలహీనం అనుకునే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అరవై ఏళ్లకుపైగా పరిపాలించింది. గత పన్నెండుళ్లుగా మాత్రమే వరుసగా అధికారంలో లేదు. దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ బలహీనం అయితే.. అందుకే ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అవుతుంది. దానికి రాహుల్ దేశంపై నిందలు వేయాల్సిన పని లేదు. దేశంలోనే ఉంటూ పోరాడుతూ వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. అందు కోసమే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అలా కాకుండా విదేశాలకు వెళ్లి భారత ప్రజాస్వామ్య విధానాలపై విమర్శలు చేస్తే.. అది మంచి లక్షణం అయ్యే అవకాశాలు ఉండవు.