రమేష్ వర్మ.. రైడ్, రాక్షసుడు లాంటి హిట్ సినిమాలు చేసిన దర్శకుడు. రవితేజతో చేసిన ‘కిలాడీ’ ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాత రమేష్ వర్మ నుంచి మరో సినిమా రాలేదు. కాకపోతే.. ఆయన తెర వెనుక చాలా పనులు చక్కబెడుతున్నారు. లారెన్స్ తో ‘కాలభైరవ’ అనే సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. ఇటీవలే సైలెంట్ గా క్లాప్ కొట్టారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇది కాకుండా లారెన్స్‌తో మరో సినిమా చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘కాలభైరవ’ పూర్తయిన తరవాత ఆ ప్రాజెక్ట్ ఉండొచ్చు. రమేష్ వర్మ నిర్మాణంలో రెండు చిన్న సినిమాలు మొదలు కానున్నాయి. ఓ చిత్రానికి ‘కొక్కొరకో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదో ఆంథాలజీ. ఇది కాకుండా ఓ హారర్ సినిమా కూడా మొదలు పెట్టబోతున్నారు.
‘కిల్’ రీమేక్ రైట్స్ రమేష్ వర్మ దగ్గరే ఉన్నాయి. ఈ కథని తెలుగీకరించారు కూడా. సరైన హీరో కోసం ఎదురు చూస్తున్నారు. అక్షయ్ కుమార్ కోసం ఓ కథ రెడీ చేశారు. ఇదో యాక్షన్ సినిమా. బాలీవుడ్ లో ఓ లవ్ స్టోరీ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు నెత్తిమీద పెట్టుకోవడం విచిత్రంగా అనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఆయన ధ్యాస ‘కాలభైరవ’ పైనే వుంది. తన బ్యానర్లో రాబోతున్న రెండు చిన్న సినిమాలకూ కొత్త దర్శకుల్ని పరిచయం చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ అతి త్వరలో రాబోతున్నాయి.