ఏపీలో ఉర్సా క్లస్టర్స్ సంస్థపై జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఖండించింది. మీడియాలో సోషల్ మీడియాలో తమ సంస్థపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వివరణ పత్రం విడుదల చేసింది. తాము ఇండియాలో కొత్తగా కంపెనీని రిజిస్టర్ చేసి ఉండవచ్చు కానీ అమెరికాలో.. ఐటీ ఫీల్డ్ లో ఎంతో అనుభవం ఉందని స్పష్టం చేశారు. వెబ్ సైట్ , ఫోన్ నెంబర్లు లేవని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించి.. ఉర్సా క్లౌడ్ పేరుతో ఉన్న వెబ్ సైట్ ను పరిచయం చేశారు.
తాము 99 పైసలకు ఎకరం తీసుకున్నట్లుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని స్పష్టం చేశారు. ఎకరం కోటి చొప్పున మూడున్నర ఎకరాలు, మిగతా భూమిని ఎకరం యాభై లక్షల చొప్పున తీసుకున్నామన్నారు. తమ కంపెనీ చిన్న ఫ్లాట్ లో ఉందని చేస్తున్న ప్రచారాన్ని కూడా తిప్పికొట్టారు. ప్రస్తుతానికి తాము లీన్ మోడ్లో పని చేస్తున్నారు. భూకేటాయింపులకు పెద్ద మొత్తంలో డబ్బులు కట్టడమే కాదు.. రెండేళ్లలో పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేసే ఒప్పందం ఉందన్నారు. అన్ని రకాల బ్యాక్ గ్రౌండ్ పరిశీలనలు చేసిన తర్వాతనే ప్రభుత్వం తమకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. తమ సంస్థ పారదర్శకంగా ఉందని.. ఒక్క డేటా సెంటర్ ను కాదని పలు డేటా సెంటర్లను నిర్వహించే సమర్థత ఉందన్నారు.
కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు అయిన సతీష్ అబ్బూరి పదేళ్లు ఒరాకిల్ లో పని చేశాడన్నారు. తర్వాత మల్టిపుల్ స్టార్టప్స్ ప్రారంభానికి సహకరించారన్నారు. అలాగే పలు కంపెనీలకు స్ట్రాటజిస్టుగా కూడా పని చేశారని తెలిపారు. అలాగే టెక్ రంగంలో దిగ్గజాలు తమ కంపెనీలో కీలక బాధ్యతల్లో ఉన్నారని ఉర్సా క్లస్టర్స్ తెలిపింది. తమ పై తప్పుడు ప్రచారాలు చేస్తే.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.