తమిళ చలన చిత్రసీమ సెన్సార్ వ్యవస్థపై సిద్దార్థ్ గుర్రుగా ఉన్నాడు. అసలు సెన్సార్ పద్ఢతులేంటో, వాళ్ల పాలసీలేంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సిద్దార్థ్. ట్విట్టర్ వేదిక చేసుకొని సిద్దార్థ్ చేస్తున్న కామెంట్లు తమిళ నాట సంచలనం సృష్టిస్తున్నాయి. హింస, అశ్లీలత, రేప్ సీన్లు ఉన్న సినిమాలు ఎంచక్కా క్లీన్ యూ ముద్ర వేయించుకొంటున్నాయని, పెద్ద నిర్మాతదీ, పలుకుబడి ఉన్నవాళ్లదే రాజ్యమని, వాళ్ల చేతిలో తమిళ చిత్రసీమ ప్లే గ్రౌండ్‌గా మారిపోయిందని వాపోతున్నాడీ హీరో. తమిళనాట సెన్సార్ బోర్డు జారీ చేసే ఏ, యుబైఏ, యూ సర్టిఫికెట్ల వెనుక రహస్యం ఉంది. ఏ సర్టిఫికెట్ వచ్చిన సినిమాలకు టాక్స్ ఓ రకంగా ఉంటుంది.. క్లీన్ యూకి మరోలా ఉంటుంది. కేవలం టాక్స్ నుంచి మినహాయింపు పొందడానికి సెన్సార్ సభ్యుల్ని ప్రభావితం చేసి యూ సర్టిఫికెట్‌ని సంపాదించుకొంటున్నారన్న విమర్శ సిద్దార్థ్ మాటల్లో వ్యక్తం అవుతోంది.
నిజానికి సిద్దార్థ్ మాటలకు తమిళ సినీ జనాలు పెద్దగా విలువ ఇవ్వకపోదును. నిన్ననే కబాలి సెన్సార్ పూర్తయ్యింది. ఈ సినిమాకి క్లీన్ యూ వచ్చింది. కబాలి మాఫియా నేపథ్యంలో సాగే సినిమా. మాఫియా అంటే రక్తపు మరక పడకుండా ఎలా ఉంటుంది? అయినా సరే.. ఆ సినిమా క్లీన్ యూ తెచ్చుకొంది. కబాలిని దృష్టిలో ఉంచుకొనే సిద్దార్థ్ ఈ కామెంట్లు చేశాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్దార్థ్‌కు మద్దతుగా నెటిజన్లు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది ఎగతాళీ చేస్తున్నారు. అయినా సరే… సిద్దూ పట్టించుకోవడం లేదు. మరి సిద్దార్థ్ ఆవేదన తమిళ చిత్రసీమకు ఏమాత్రం అర్థమవుతుందో, వాళ్లెంత పట్టించుకొంటారో చూడాలి.