కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని తన రాజకీయేతర ప్రత్యర్థిగా సోదరుడు కేశినేని శివనాథ్ను ఎంచుకున్నారు. రాజకీయాల్లో లేరు కాబట్టి ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు ఉండరు. అంటే వ్యక్తిగత శత్రువులాగే భావిస్తున్నారని అనుకోవచ్చు. ఉర్సా కంపెనీకి భూకేటాయింపులపై వివాదం ప్రారంభం కానే కేశినేని నాని ఎప్పుడూ లేని.. ఈ స్కాంలో కేశినేని చిన్ని హస్తం ఉందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. ఉర్సా కంపెనీలో ఓ డైరక్టర్.. కేశినేని చిన్ని క్లాస్ మేట్ అని.. అందుకే ఆయన పాత్ర ఉందని ఆరోపించారు.
ఉర్సా కంపెనీని ప్రభుత్వం వద్దకు కేశినేని చిన్ని తెచ్చాడో లేదో కానీ.. ఆయనపై మాత్రం బురద పడిపోయింది. అసలు తమ కంపెనీకి విజయవాడ ఎంపీకి ఎలాంటి సంబంధం లేదని ఉర్సా కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. తనపై అసత్య ఆరోపణలు చేశారని.. నేరుగా నాని పేరు చెప్పకుండా.. శివనాథ్ సోషల్ మీడియా అకౌంట్లో తీవ్ర ఆరోపణలు చేస్తూ ట్వీట్ పెట్టారు. అవి ఆరోపణలు కన్నా తిట్ల స్థాయిలోనే ఉన్నాయి.
మరో వైపు కేశినేని నాని తన సోదరుడ్ని వదిలి పెట్టడం లేదు. తన ఆఫీసుకు ఎన్టీఆర్ పేరు పెట్టుకుని అన్ని దందాలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇసుక, గ్రావెల్ ఇలా చాలా మాఫియాలను నడిపిస్తున్నారని ఎన్టీఆర్ పేరు తీసేసి చార్లెస్ శోభరాజ్ పేరు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. కేశినేని నాని రాజకీయాల్లో లేరు కానీ.. ఆయన తన సోదరుడి మీద మాత్రం పగతో రగిలిపోతున్నారని ఈ ట్వీట్లతో అర్థమైపోతోంది. ఈ పగ ఎందుకో వారి కుటుంబాలకే తెలియాలి. కానీ రాజకీయాల నుంచి రిటైరైన నాని ఇలా ఎందుకు సోదరుడ్ని టార్గెట్ చేస్తున్నారన్నది మాత్రం ఆసక్తికరమే.