కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ బదులు ఇచ్చే దిశగా భారీ ప్రణాళికలు వేస్తోంది. వరుసగా అత్యున్నత సమావేశాలు నిర్వహిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా నేరుగా టెర్రర్ ఎటాక్ జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ కీలక అధికారులతో చర్చలు జరుపుతున్నారు. త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సమావేశమయ్యారు. అప్పమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చారు.
ఇటీవలి కాలంలో తమపై జరుగుతున్న ఉగ్ర దాడుల్ని ఏ దేశం కూడా సహించడం లేదు. ఉగ్రవాదం కాకపోయినా తమకు ముప్పుగా మారుతోందని ఉక్రెయిన్ ను నేల మట్టం చేసింది రష్యా. మధ్య ప్రాచ్యంలోనూ అలాంటివే జరుగుతున్నాయి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ను ఎందుకు సహించాలన్న ప్రశ్న వస్తోంది. రష్యా ఉక్రెయిన్ ను ఎలా అణిచివేసిందో అలా అణిచి వేయాలన్న వాదన వినిపిస్తోంది. ఈ దిశగా భారత్ సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్ కూడా భారత్ తమపై దాడి చేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దాడి చేస్తే కాచుకోవడానికి సిద్ధమని సంకేతాలు పంపుతూ.. సరిహద్దుల వద్ద యుద్ధ విమానాలను మోహరిస్తోంది. సైనికుల్ని అప్రమత్తం చేస్తోంది. అయితే భారత్ ఒక్క రోజు చేసే దాడితో పాకిస్తాన్ పరిస్థితి ఘోరంగా మారుతుంది. అందుకే .. దేశానికి చిన్న నష్టం జరగకుండా పాక్ అంతు చూసేందుకు స్కెచ్ వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.