పాకిస్తాన్ ప్రేరేపిత దాడిగా భావిస్తున్న పహల్గం ఉగ్రదాడిని ఏమాత్రం ఉపేక్షించవద్దని కేంద్రం డిసైడ్ అయిందా? ఈ ఘటనతో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? సర్జికల్ స్ట్రైక్ 3.0 లోడ్ అవుతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
జమ్మూ – కాశ్మీర్ లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడిపై యావత్ దేశం పాక్ పై రగిలిపోతోంది. ఈ దాడి పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిగా కేంద్రం కూడా భావిస్తోంది. దీంతో ఈసారి ఎలాగైనా దాయాది దేశానికి గట్టి బుద్ధి చెప్పాలని ఒత్తిళ్లు కూడా వస్తున్నాయి. కేంద్రం కూడా ఆ దిశగా సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం కేంద్రం కీలక సమావేశం నిర్వహిస్తోంది.ప్రధాని నివాసంలో ఈ అత్యున్నత స్థాయి మావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడు అజిత్ దోవల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలని నిర్ణయం తీసుకునుందనే ప్రచారం జరుగుతోంది.ప్రధానంగా సర్జికల్ స్ట్రైక్ 3.Oపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.
2016 సెప్టెంబర్ 18న జైషే – మహ్మద్ ఉగ్రవాదులు జమ్మూ – కాశ్మీర్ లోని ఉరిలో ఉన్న భారత ఆర్మీ స్థావరంపై దాడి చేయగా.. ఈ ఘటనలో 19మంది సైనికులు అమరులయ్యారు. దీంతో పాక్ కు బుద్ధి చెప్పేందుకు అదే ఏడాది సెప్టెంబర్ 28న రాత్రి భారత ఆర్మీ పీఓకేలోని నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది.
తిరిగి 2019 ఫిబ్రవరి 26న భారత సైన్యం రెండోసారి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి చేయడంతో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ఫిబ్రవరి 26న పీవోకేలోని బాలకోట్ , చకోతిలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి.
ఈ నేపథ్యంలో పహల్గంలో ఉగ్రదాడి జరగడంతో కౌంటర్ ఇచ్చేందుకు భారత్ త్రివిధ దళాలను సిద్దం చేస్తోంది. పాక్ ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు కేంద్రం సమాయత్తం అవుతోంది. ఈ సాయంత్రం జరగనున్న అత్యున్నత స్థాయి సమావేశంలో సర్జికల్ స్ట్రైక్ 3.O పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.