కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ రెండోదశ విచారణ ప్రారంభించనుంది. ఇప్పటికే మొదటిదశ విచారణను పూర్తి చేసిన కమిషన్ గురువారం నుంచి మరో దఫా విచారణను కొనసాగించనుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలకు కమిషన్ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఖర్చులపై కమిషన్ క్షుణ్ణంగా విచారణ చేపట్టింది. ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరించిన కమిషన్… దర్యాప్తులో మరింత లోతైన సమాచారం సేకరించేందుకు గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెలతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగియనుంది. అయితే, విచారణ ముగింపు దశకు వచ్చినప్పటికీ మరికొంత సమాచారం సేకరించేందుకు కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు అధికారులను మాత్రమే విచారణకు పిలిచిన కమిషన్..నెక్స్ట్ విచారణలో నేతలను పిలవాలని భావిస్తోంది. దీంతో తెలంగాణ సర్కార్ కమిషన్ గడువును పెంచే ఆవకాశం కనిపిస్తోంది.
ఎన్నికలకుముందు కాళేశ్వరంను కమిషన్ల ప్రాజెక్టుగా ప్రచారం చేసింది కాంగ్రెస్. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తామని చెప్పినట్టుగానే, అధికారం చేపట్టాక కమిషన్ ను నియమించింది. ఇప్పుడు లోతైన దర్యాప్తు చేస్తున్న కమిషన్… ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ , అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావులకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.