వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎలాగయినా గెలిచి మళ్ళీ రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి మొదటి నుంచే ఊహించని ఎదురుదెబ్బలు తగులు తున్నాయి. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నిర్మల్ ఖత్రి నిన్న తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. ఆయన స్థానంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్ బబ్బర్ ని పిసిసి అధ్యక్షుడుగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది.
రాజ్ బబ్బర్ 2014 సార్వత్రిక ఎన్నికలలో ఘజియాబాద్ నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్ధి వికె సింగ్ చేతిలో ఓడిపోయారు. ఆయన అనేక హిందీ, పంజాబీ సినిమాలలో నటించారు. 1989లో జనతా దళ్ పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరి రెండు సార్లు లోక్ సభకి ఎన్నికయ్యారు. 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. అప్పటి నుంచి దానిలోనే కొనసాగుతున్నారు. ఊహించని విధంగా చాలా కీలకమైన సమయంలో ఆయనకి చాలా కీలకమైన పదవి లభించింది. కనుక ఆయన సమర్దకి ఇదొక అగ్ని పరీక్ష వంటిదే. దానిని ఆయన నిరూపించుకోవలసి ఉంటుంది. ఆ పదవికి ఆయనని ఎంచుకోవడం సరైన నిర్ణయమో కాదో ఎన్నికలలోగానే తెలిసిపోవచ్చు.