ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది ‘హిట్ 3’. ఈ సినిమాపై మంచి బజ్ వుంది. హీరోగా నాని ఫామ్ లో ఉండడం, నిర్మాతగా తన టేస్ట్ పై ప్రేక్షకుల్లో నమ్మకం కలగడం, పైగా అన్నింటికి మించి ఇది ‘హిట్’ ఫ్రాంచైజీ కావడం వల్ల ఈ సినిమా చూడాలన్న ఉత్సాహం ప్రేక్షకుల్లో వుంది. ఈమధ్య థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదన్న అసంతృప్తిని `హిట్ 3` తొలగిస్తుందన్న నమ్మకం చిత్రసీమకూ వుంది. ఈ నేపథ్యంలో ‘హిట్ 3’ ప్రమోషన్ల జోరు పెంచారు నాని. ఇప్పటికే తెలుగులో మీడియా ఇంట్రాక్షన్ పూర్తి చేసిన నాని, ఇప్పుడు పాన్ ఇండియా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ముంబైలో నానికి మంచి స్వాగతం లభించింది. ఇప్పుడు కొచ్చిలో ఉన్నారు నాని.
ఈసారి బాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర కూడా ‘హిట్ 3’ ప్రభావం ఉంటుందన్న ఆశతో ఉన్నాడు నాని. దానికీ కారణం వుంది. ‘హిట్ 3’ యాక్షన్ డ్రామా. ఇన్వెస్టిగేషన్ కథ. హింస కావల్సినంత ఉంది. ఇలాంటి కథలు సరిగ్గా చెప్పాలే కానీ, సరిహద్దులు లేవు. పైగా సౌత్ నుంచి వస్తున్న సినిమాలపై బాలీవుడ్ ప్రేక్షకులు ఈమధ్య బాగా ఆసక్తి చూపిస్తున్నారు. నాని డబ్బింగ్ సినిమాలు ఇప్పటికే హిందీ మార్కెట్ లో బాగా చూశారు. టీవీల్లో ఇప్పటికీ వాటికి మంచి రేటింగులు ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ కథలకు. మీడియా కూడా ‘హిట్ 3’పై స్పెషల్ గా ఫోకస్ చేసింది. కాస్త పాజిటీవ్ టాక్ వస్తే.. బాలీవుడ్ లోనూ మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉంది. బాలీవుడ్ మార్కెట్ ని కాస్త కాస్త ఆకర్షిస్తూ.. అక్కడ కూడా తన సినిమాల్ని సేల్ చేసుకోవాలని నాని ప్రయత్నిస్తున్నాడు. దసరా, సరిపోదా శనివారం సినిమాలతో అక్కడ కాస్త ప్రయత్నం చేశాడు కూడా. ‘హిట్ 3’ తో తన ప్రయత్నం ఫలిస్తే.. ‘ప్యారడైజ్’కు అది హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడు. నాని లాంటి హీరోలకు, ఈ జోనర్లో చేసే సినిమాలకు బాలీవుడ్ లోనూ స్పేస్ వుంది. కాబట్టి `హిట్ 3` కూడా అక్కడ మంచి వసూళ్లు అందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.