ఎక్కడో ముంబైలో పుట్టి పెరిగిన వాడు. ఇప్పుడు కేంద్రంలో రైల్వే మంత్రిగా ఉన్నాడు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. అంతే, ఎన్నికైన నెలలోపే, ఏపీకి తన ఎంపీ నిధుల నుంచి భారీ కేటాయింపులు ప్రకటించాడు. ఆయనే సురేష్ ప్రభు.
గత నెలలో ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన రైల్వే మంత్రి సురేష్ ప్రభు, రాష్ట్రంలోని 13 జిల్లాలకు 13 అత్యాధునిక ఆంబులెన్స్ ను ఇస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కో దాని విలువ 35 లక్షల రూపాయలు. అంటే మొత్తం విలువ 4 కోట్ల 55 లక్షలు. ఎంపీ లాడ్స్ ద్వారా ఆయనకు ఏడాదికి 5 కోట్ల నిధులు వస్తాయి. అంటే ఒక ఏడాది నిధులను వెంటనే వెచ్చించడానికి నిర్ణయించారు. ఎంపీగా ఆయనకు ఏపీయే స్వరాష్ట్రం.
తాను పుట్టిన పెరిగిన రాష్ట్రం కంటే తనను ఎన్నుకున్న రాష్ట్రానికి నిధులు కేటాయించాలనే బాధ్యతలను ఆయన గుర్తెరిగారు. పైగా ఆ ఆంబులెన్సులు ఏవో మామూలువి కావు. అత్యాధునికమైన, లైఫ్ సేవింగ్ ఆంబులెన్స్ లు. వాటిలో వెంటిటేలర్ సదుపాయం కూడా ఉంటుంది. ఇలాంటి ఆంబులెన్స్ సకాలంలో అందుబాటులో ఉండి ఉంటే, ఆనాడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎర్రన్నాయుడు బతికే వారేమో.
ఏపీ నుంచి లోక్ సభ, రాజ్యసభ సభ్యులు చాలా మందే ఉన్నారు. లోక్ సభ సభ్యుల పదవీ కాలం రెండేళ్లు పూర్తయింది.మూడో ఏడాది మొదలైంది. అంటే వాళ్ల చేతిలో 15 కోట్ల నిధులున్నాయి. మరి, తమ సొంత రాష్ట్రానికి ఈ నిధులను ఏమేరకు ఖర్చు చేశారో చూడండి. నెల్లూరు వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ విషయంలో మిగతా ఏపీ ఎంపీలకంటే మెరుగ్గా ఉన్నారు. ఆయన ఎంపీలాడ్స్ నిధుల్లో 7 కోట్ల వరకూ వివిధ పనులకు వినియోగించారు. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రాంమోహన్ నాయుడు రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తన ఎంపీ నిధుల్లో 6 కోట్ల రూపాయల వరకూ వినియోగించారు.
మిగిలిన ఎంపీలు చాలా మంది ఇంత ఉదారంగా నిధులను వినియోగించలేదు. అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కనీసం కోటి రూపాయలు కూడా వినియోగించ లేదట. ఇంకా చాలా మంది ఎంపీలు కోటి రెండు కోట్ల మధ్య వినియోగించారు.
ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చిన సురేష్ ప్రభు, ఏపీ నుంచి ఎన్నికైన విశ్వాసంతో ఒక ఏడాది నిధులను ఒక్కనెలలోనే ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వినియోగించారు. అంతేకాదు, ఏపీతో అత్యాధునికి ట్రౌమా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు. మరి, ఈ రాష్ట్రంలో పుట్టిపెరిగిన మన ఎంపీల్లో కొందరు ప్రజా ధనాన్ని ప్రజల కోసం ఉపయోగించడానికి కూడా వెనుకాడటం ఎందుకో? సురేష్ ప్రభుతు చూసిన తర్వాతైనా వీళ్లు ప్రజల అవసరాల కోసమో, ఆరోగ్య పరిరక్షణ కోసమో, విద్యార్థుల కోసమో నిధులను వినియోగిస్తారేమో చూద్దాం.