అమరావతి నిర్మాణం రీ స్టార్ట్ కు సమయం దగ్గర పడింది. మే రెండో తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత వివిధ రకాల ప్రైవేటు సంస్థలు కూడా పనులు మొదలు పెట్టేలా చూడనున్నారు. ఏఐతో పాటు క్వాంటం కంప్యూటింగ్ పైనా ఎక్కువ దృష్టి పెడుతున్న ఏపీ ప్రభుత్వం అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.
దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్‌ను అమరావతిలో ఏర్పాటుచేసే ప్రయత్నాలు ప్రారంభించింది.. 50 ఎకరాల్లో క్వాంటమ్ విలేజ్ ఏర్పాటు అంశంపై ఇప్పటికే బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నారు. ఈ విలేజ్ నిర్మాణంలో అత్యంత కీలకమైన ఐకానిక్ భవన నిర్మాణ డిజైన్‌ను అందించడానికి ఎల్అండ్టీ సంస్థ ముందుకొచ్చింది. అవసరమైన అత్యాధునికమైన కంప్యూటర్ సిస్టమ్‌లను ఐబీఎం అందించనుంది. ఇక్కడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్టేట్ డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
దేశానికే గుర్తింపు తెచ్చే సాంకేతిక విజ్ఞాన కేంద్రంగా మారేలా క్వాంటమ్ విలేజ్ ను అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఏఐ తో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ ను ప్రోత్సహిస్తూ మైల్ స్టోన్ లాంటి పెట్టుబడి ఒకటి వస్తే.. అమరావతికి తిరుగు ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.