ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకుడు. ఈ చిత్రంలో ఇమాన్వీ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి తరవాత.. ఓ వార్త ఎక్కువగా హల్ చల్ చేసింది. ఇమాన్వీ పాకిస్థాన్‌కి చెందిన అమ్మాయి అని, ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరు పాకిస్థాన్ ఆర్మీలో పని చేస్తున్నారన్నది ఆ వార్తల సారాంశం. భారతదేశంలో పాకిస్థాన్ పౌరుల్ని వెదికి మరీ, ఇంటికి పంపేస్తున్న ఈ నేపథ్యంలో ఇమాన్వీని కూడా అలానే పంపేయాలని, ఆమెకు ఇక్కడ అవకాశాలు ఇవ్వకూడదన్న కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమాన్వీ క్లారిటీ ఇచ్చింది. ఉగ్రవాదుల దాడి తనని చాలా కలచివేసిందని, ప్రాణాలు కోల్పోయిన వాళ్ల ఆత్మలు శాంతించాలని, ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరక్కూడదని ప్రార్థిస్తున్నానని చెప్పుకొచ్చిన ఇమాన్వీ తనపై పడిన పాకిస్థానీ ముద్రని చెరిపివేసే ప్రయత్నం చేసింది. ”నా కుటుంబ నేపథ్యం గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. నా కుటుంబంలో ఎవరూ పాకిస్థాన్ ఆర్మీలో పని చేయడం లేదు. నేను లాస్ ఏంజెల్స్ లో పుట్టాను. నా తల్లి దండ్రులు చట్టబద్ధంగా యూఎస్‌కు వలస వచ్చారు. వాళ్లు ఇప్పటికీ అమెరికన్ పౌరులే. నన్ను భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఆదరించింది. నా కళకు ఓ స్థానాన్ని కల్పించింది. కళ అనేది చరిత్రని, సంస్కృతిని, అనుభవాల్ని కలిపే ఓ వేదిక. నేను ఆ బాధ్యతను ఎప్పటికీ మర్చిపోను. భారతీయతను, ఇక్కడి సంప్రదాయాల్ని గౌరవిస్తాను. దయ చేసి నాపై తప్పుడు ప్రచారాన్ని ఆపండి” అంటూ మీడియాను కోరింది.
ఇమాన్వీ సోషల్ మీడియాలో ఓ స్టార్. రీల్స్ తో, షార్ట్స్‌తో… లెక్కలేనంతమంది అభిమానుల్ని సంపాదించుకొంది. మంచి డాన్సర్ కూడా. అలానే… ‘ఫౌజీ’లో అవకాశాన్ని అందుకొంది. పాకిస్థాన్ తో కానీ, అక్కడి ఆర్మీతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదు. అయినా మరి.. ఎందుకు ఈ వదంతులు పుట్టుకొచ్చాయో. మొత్తానికి తనపై పడిన అపవాదును వీలైనంత త్వరగా తుడిచి వేసేందుకు తగిన ప్రయత్నమే చేసింది ఇమాన్వీ.