వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం రాజమండ్రి వెళ్లి మాజీ కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ని పరామర్శించారు. ఇటీవల ఉండవల్లి తల్లి మరణించారు. జగన్ తో బాటు జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు బారీ సంఖ్యలో ఉండవల్లి ఇంటికి వెళ్ళారు. వారిద్దరూ పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలోనే కొద్దిసేపు మాట్లాడుకొన్నారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి నేటి వరకు ఏ పార్టీలోను చేరలేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనని వైకాపాలోకి ఆహ్వానించినప్పటికీ ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికే వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఒకవేళ ఆయనకి అటువంటి ఉద్దేశ్యం లేనట్లయితే జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని ఆయన ఇంటికి వచ్చి పరామర్శించనవసరం లేదు. కనుక త్వరలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ వైకాపాలో చేరుతారేమో? ఏవిషయం పైనైనా అనర్గళంగా ప్రసంగించగల నేర్పు, జిల్లా రాజకీయాలపై మంచి పట్టున్న ఉండవల్లి ఒకవేళ వైకాపాలో చేరినట్లయితే ఆ పార్టీ ఇక జిల్లాలో వెనుతిరిగి చూసుకోనవసరం లేదు.