కాళేశ్వరంలో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఉపయోగపడవని.. ఉపయోగిస్తే ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చని నేషనల్ డ్యామ్ ప్రొటెక్షన్ అధారిటీ నివేదిక సమర్పించింది. వీటిని రీ డిజైన్ చేసి.. మళ్లీ నిర్మించాలని సిఫారసు చేసింది. నిర్మాణం, డిజైన్లో అన్నీ లోపాలేనని స్పష్టం చేసింది. మూడు బ్యారేజీల్లోనూ సీకెంట్ ఫైల్స్ కూలిపోవడం, బ్యారేజ్ ఎగువ, దిగువల్లో రంధ్రాలు ఉన్నట్లుగా గుర్తించారు. పలు పరీక్షలు చేసి 14 నెలల అధ్యయనం తర్వాత NDSA ఈ రిపోర్టు ఇచ్చింది
బ్యారేజీల నిర్మాణం చేయడానికి. చేయాల్సిన భూసార పరీక్షలుకూడా చేయలేదని గుర్తించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఒకచోట ప్రతిపాదించి, మరో చోటికి మార్చారు. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 ప్రకారం వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని పరిశీలించాలి. కానీ అలాంటి ప్రయత్నం చేయలేదని రిపోర్టు స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో నిర్మాణ, నిర్వహణ, డిజైన్ లోపాలే మూడు బ్యారేజీలకు గండిని తేల్చేయడంతో రాజకీయంగానూ కలకలం రేపే అవకాశాలు ఉన్నాయి.
కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఈ రిపోర్టు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఫైనల్గా కేసీఆర్, హరీష్ రావులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోఎన్డీఎస్ఏ రిపోర్టు రావడం బీఆర్ఎస్కు షాక్ లాంటిదే. ఇప్పుడు సాధారణ ప్రజలు.. పాలక పార్టీ నుంచి వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది.