భారత్ సమ్మిట్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమావేశాన్ని చాలా మంది పెట్టుబడుల సమావేశంగా అనుకుంటున్నారు. కానీ అది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని షేర్ చేసుకునే వేదికగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని ఎలా నిర్వహిస్తారో అచ్చంగా అలాగే నిర్వహిస్తున్నారు. హెచ్ఐసీసీలో శుక్ర , శనివారాల్లో జరగనున్న సమావేశంలో ముఖ్య అతిధులంతా కాంగ్రెస్‌కు చెందిన వారే. మొదటి రోజు కీలక ప్రసంగం రాహుల్ గాంధీ చేస్తే.. రెండో రోజు ప్రియాంకా గాంధీ చేస్తారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుంచి కేసీ వేణుగోపాల్, సామ్ పిట్రోడా వరకూ చాలా మంది పాల్గొంటారు. ప్రసంగిస్తారు. తెలంగాణను గ్లోబల్ డైలాగ్ ,ఆవిష్కరణల కేంద్రంగా నిలపడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ రైజింగ్ విజన్‌ను ప్రదర్శించి.. గ్లోబల్ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని ప్రకటించింది. అయితే పార్టీ నేతలతో రాజకీయ ప్రసంగాలు ఇప్పిస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని ఎవరికైనా వచ్చే ప్రాథమిక సందేహం.
వందదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ వంద దేశాల ప్రతినిధులు ఎవరో మాత్రం స్పష్టత లేదు. ఈ సమావేశానికి సహకారం అందించాలని గతంలో కేంద్ర విదేశాంగమంత్రిని సీఎం రేవంత్ కూడా కలిశారు. కేంద్రం తరపున సాయం కూడా అందుతోందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సమావేశానికి భారత్ సమ్మిట్ అని పెట్టి.. పార్టీ కార్యక్రమం తరహాలో నిర్వహించడం ఖచ్చితంగా వివాదాస్పదమయ్యే అవకాశాలు ఉన్నాయి.