ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్దిదారు అని సీఐడీ కేసులో ఏ 8గా ఉన్న చాణక్య అనే వ్యక్తి రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఎవరెవరి ద్వారా ఎంత మొత్తంలో జగన్ కు చేరాయో మొత్తం రాశారు. ఇందులో వింతేమీ లేదు. లిక్కర్ స్కాం జగన్ కు తెలియకుండా జరుగుతుందని..జరిగిందని చిన్న పిల్లవాడు కూడా నమ్మరు. ఎమ్మార్వో ఆఫీసులో తీసుకునే లంచాల గురించి కూడా తాడేపల్లి ఆఫీసులో తెలుస్తుంది. అందులో కమిషన్లు తీసుకుంటారన్న ఆరోపణలు గతంలోనే ఉన్నాయి. స్వయంగా స్కెచ్ వేసుకున్న లిక్కర్ స్కాంలో డబ్బులు ఆయనకు కాకుండా ఎవరికి చేరుతాయి?
ఇక్కడ దర్యాప్తు సంస్థలు భౌతికంగా జగన్ కు ఆ డబ్బులు ఎలా చేరాయో ఆధారాలతో సహా చెప్పాల్సిన ఉంది. భారతి సిమెంట్స్ లో ప్రతి నెలా అనుమానాస్పదంగా జమ అయిన మొత్తం.. పెద్దిరెడ్డికి చెందిన కంపెనీల్లో జమ అయిన మొత్తం.. వందల కేజీల బంగారం రూపంలో తీసుకున్న లంచాలు అన్నీ స్వాధీనం చేసుకోవాలి. అనుమానాస్పద లావాదేవీల గుట్టు బయట బట్టి వాటిని సీజ్ చేయాల్సి ఉంది. మనీ ట్రయల్ చూపిస్తే జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయవచ్చు.
లిక్కర్ స్కాం చిన్నది కాదు. డబ్బుల దోపిడీ ఇందులో ప్రధాన అంశం కావొచ్చు కానీ.. అంతకు మించి ప్రజల రక్తం పీల్చిన అంశం కీలకం. ఓ పాలకుడు ఎంత ఘోరంగా ప్రజల రక్తమాంసాలను పీల్చవచ్చో చూపించిన స్కాం ఇది. మద్యం అలవాటు ఉన్న వారిని టేకిట్ గ్రాంట్ గా తీసుకుని..దోచేసుకున్నారు. ఈ పాపం చేసిన వారిని క్షమించడం కూడా నేరమే.