పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్యల్లో కీలకమైనది సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడం. దీని ద్వారా పాకిస్తాన్ ఆకలితో అలమటిస్తుందని .. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని.. ఒక్క మిస్సైల్ పేల్చకుండా సగం పాకిస్తాన్ ను నాశనం చేసే యుద్ధమని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కొంత మందికి పారే నదిని ఎలా ఆపుతారన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందాల కారణంగా ఇప్పటి వరకూ సింధు నదిపై ఎలాంటి డ్యాములు నిర్మించలేదు. ఇప్పటికిప్పుడు నిర్మించి ఇండియా ఆపగలదా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సింధు నదిని మళ్లించడానికి అవసరమైన సరంజామా భారత్ వద్ద ఉందని నిపుణులు చెబుతున్నారు.
నీటి నిల్వకు డ్యాములు కట్టలేదు కానీ.. విద్యుత్ ప్రాజెక్టులు మాత్రం వరుసగా భారత్ నిర్మిస్తూ వస్తోంది. బాగ్లిహార్ అనే ప్రాంతం వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించారు. వాటి ద్వారా పాకిస్తాన్ కు జల ప్రవాహాన్ని ఇప్పటికే తగ్గించారు. 2019 పుల్వామా దాడి తర్వాత, బియాస్, రావి, సట్లెజ్ జలాలను పూర్తిగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు మళ్లించే ప్రణాళికలను కేంద్రం ప్రకటించింది. ఈ జలాలను షాహ్పూర్-కండి డ్యామ్ లేదా ఇతర సౌకర్యాల ద్వారా మళ్లించవచ్చు. ఇండస్ నది వ్యవస్థలోని రావి నదిపై పంజాబ్‌లో న్న షాహ్పూర్ కండి డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఒప్పందాల కారణంగా పూర్తి చేయలేదు. ఇ్పపుడు ఇది పూర్తి చేస్తే పాకిస్తాన్‌కు నీళ్లు ఆగిపోతాయి.
సింధు నది వ్యవస్థలోని ప్రధాన నదులు భారత భూభాగం గుండా ప్రవహిస్తాయి కాబట్టి వాటిని నియంత్రించడం భారత్ చేతుల్లోనే ఉంటుంది. భారత్ ఇప్పటికే జలవిద్యుత్ మరియు నీటిపారుదల ప్రాజెక్టులలో అధునాతన సాంకేతికతను కలిగి ఉంది. పారే నీటిని ఆపుకునే డ్యాములను ఇప్పటికిప్పుడు కట్టలేకపోవచ్చు కానీ.. వాటిని మళ్లించి ఇతర చోట్లకు తరలించే అవకాశం మాత్రం ఉంటుంది. సింధునది విషయంలో కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుందని చాలా మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు.