భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రజతోత్సవం సభను ఆదివారం ధూమ్ థామ్ గా నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకుంది. మీడియా, సోషల్ మీడియా మేనేజ్మెంట్లో ఓ ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న బీఆర్ఎస్ నేతలు.. సభ జరిగే నాటికి ప్రచారాన్ని, భావోద్వేగాన్ని పీక్స్ కు తీసుకెళ్లాలని అనుకున్నారు. తీరా చూస్తే.. అసలు పబ్లిసిటీ లేకుండా పోయింది. చివరికి తమకు చాలా బలం ఉన్న సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్ ఆవిర్భావసభ.. ఎప్పట్లాగే పెట్టే ఓ రొటీన్ సభ అన్నట్లుగా ప్రచారంలోకి వచ్చింది. అది మైల్ స్టోన్ అన్న అభిప్రాయాన్ని కల్పించలేకపోయారు.
దీనికి కారణం పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడే. ఏ ఇష్యూ లేకపోతే సోషల్ మీడియా సైన్యం అంతా బీఆర్ఎస్ రజతోత్సవ సభ మీద ఉండేవారు. కానీ పెహల్గాం ఇష్యూ వచ్చే సరికి అందరి దృష్టి పాకిస్తాన్ పై సోషల్ మీడియా యుద్ధం చేయడంపైనే ఉంది. బీఆర్ఎస్ ను ఆ పార్టీ కార్యకర్తలు కూడా పెద్దగా పట్టించుకోలేకపోతున్నారు. అక్కడక్కడా ర్యాలీలు చేసినా.. సన్నాహాలు కూడా ఎక్కువగా లేవు. ఇలాంటి బహిరంగసభలకు ఓ మూమెంట్ తీసుకు వస్తే తప్ప విజయం సాధించడం సాధ్యం కాదు.
గతంలో హైదరాబాద్ శివారులోని ఓ బహిరంగను కేటీఆర్ నాయకత్వంలో నిర్వహించారు కేసీఆర్. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు ఏర్పాటు చేసిన సన్నాహాక సభ. అధికారంలో ఉండి అన్ని అనుకులంగా చేసుకుని మరీ సభ నిర్వహించినా జనం అనుకున్నంతగా రాలేకపోయారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా.. పార్టీ నేతలంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి హైప్ తెచ్చుకునే వ్యూహాలను అమలు చేయలేకపోయారు. సభ విషయంలో తేడా వస్తే.. బీఆర్ఎస్ గురించి నెగెటివ్ ప్రచారం మరింతగా పెరుగుతుంది.