విజయసాయిరెడ్డిని సీఐడీ అధికారులు లిక్కర్ స్కాంలో సాక్షిగా పిలిచారు. కానీ ఆయనను ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చారు. ఈ ఎఫ్ఐఆర్ గురించి తెలిసిన వెంటనే ఆయన ఓ ట్వీట్ పెట్టారు. దాని సారాంశం ఏమిటంటే ఈ స్కాంలో ఉన్న వారి గురించి అన్నీ చెప్పేస్తానని. ఇప్పుడు ఆయనను అప్రూవల్ గా మార్చేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. విజయసాయిరెడ్డి నిజాలు చెబుతారా లేదా అన్నది కాకుండా.. తమ సేకరించిన సాక్ష్యాలకు అనుగుణంగా ఆయన చెబుతున్నారా అబద్దాలు చెబుతున్నారా అన్నది బేరీజు వేసుకుని సీఐడీ అధికారులు ఆయనను విశ్వసించే అవకాశాలు ఉన్నాయి.
సజ్జల రామకృష్ణారెడ్డి సమీప బంధువు.. ఎస్పీవై ఇండస్ట్రీస్ తరపున లిక్కర్లు తయారు చేసి అమ్మిన సజ్జల శ్రీధర్ రెడ్డిని తాజాగా అరెస్టు చేశారు. ఆయన గురించి పూర్తి సమాచారం విజయసాయిరెడ్డి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో సజ్జల శ్రీధర్ రెడ్డికి కీలక పాత్ర. మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేయడంలో.. ఉత్పత్తికి తగ్గట్లుగా కప్పం కట్టించుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ఇప్పటికే. కెసిరెడ్డి రాజ్ తో పాటు ఏ8 చాణక్యను..ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. మిగిలిన వారిలో కొంత మంది అందుబాటులో ఉన్నా.. అరెస్టు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే జగన్ కు అక్రమాస్తులు కూడబెట్టివ్వడానికి జైలుకెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మాత్రం మరోసారి అలాంటి త్యాగం చేయాలనుకోవడం లేదు. తనను ఘోరంగా అవమానించారని ఆయన ఫీలవుతున్నారు. అందుకే తాను లిక్కర్ స్కామ్ లో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. తాను ఏమీ సంపాదించుకోలేదని.. ఇతరులు సంపాదించుకుని తనను బలి పశువును చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు. మొత్తం బయట పెట్టి తాను బయటపడాలని అనుకుంటున్నారు. అందుకే ప్రతి వివరాన్ని ఆయన సీఐడీ అధికారులకు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.