మే 9న ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ ప్రకటించిన తరవాత… శ్రీవిష్ణు సినిమా ‘సింగిల్’ కూడా అదే డేట్ ఫిక్సయ్యింది. ఓ పక్క పవన్ కల్యాణ్ సినిమా ఉన్నప్పుడు శ్రీవిష్ణు ఎలా ధైర్యం చేశాడబ్బా? అని అనుకొన్నారంతా. కానీ ఇప్పుడు ‘వీరమల్లు’ వాయిదా పడింది. జూన్ లేదా జులైలో ‘వీరమల్లు’ రావొచ్చు. మే 9న బాక్సాఫీసు ఎంట్రీకి ఇప్పుడు శ్రీవిష్ణుకు ద్వారాలు తెరచుకొన్నాయి.
‘స్వాగ్’ తరవాత శ్రీవిష్ణు చేసిన సినిమా ‘సింగిల్’. `స్వాగ్`పై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈసారి ఎలాగైనా తనకో హిట్ కావాలి. అందుకే తనకు అచ్చొచ్చిన ఎంటర్టైన్మెంట్ జోనర్‌ని పట్టుకొన్నాడు. ‘సింగిల్’ అనే టైటిల్ లోనే బ్రహ్మచారి కథ అని అర్థమైపోతోంది. యూత్ కి రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది. థియేటర్లకు బతికించేది వాళ్లే కాబట్టి, ఈసారి శ్రీవిష్ణు మంచి ఓపెనింగ్స్ అందుకోవొచ్చు. కార్తీక్ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. కేతిర శర్మ, ఇవానా కథానాయికలు. గీతా ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కింది. గీతా ఆర్ట్స్ సపోర్ట్ వుంది కాబట్టి.. కావల్సిననన్ని థియేటర్లు దొరకే అవకాశం ఉంది. అయితే మే 9న శ్రీవిష్ణుకు సోలో రిలీజ్ దొరకలేదు. సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’తో పాటు ‘కలియుగం’ అనే మరో సినిమా కూడా ఇదే రోజున విడుదల కాబోతున్నాయి. ‘శుభం’ కాన్సెప్ట్ సినిమా. సమంత ఈ సినిమాకు జోరుగా ప్రమోషన్లు చేసే ఛాన్స్ వుంది. కల్కి కాన్సెప్ట్ తో ‘కలియుగం’ సిద్ధమైంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఇది మంచి ఆప్షన్ కావొచ్చు.