విశాఖలో కూటమి ఎమ్మెల్యేలు ఇద్దరు ఫిల్మ్ క్లబ్ లీజుల వ్యవహారంలో వాగ్వాదానికి దిగారు. ఓ కార్యక్రమానికి హాజరైన గంటా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇటీవల విష్ణుకుమార్ రాజు.. ఫిల్మ్ క్లబ్ విషయంలో కలెక్టర్ కు చేసిన ఫిర్యాదు గురించి మాట్లాడారు. ఆ ఫిల్మ్ క్లబ్ భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. పైగా ఫిల్మ్ క్లబ్ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని కబ్జా చేశారు.
మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ వైసీపీ నేతలతో రాజీనామాలు చేయించారు. అయితే ఇప్పుడు ఆ క్లబ్ కు సంబంధించి ఉన్న భూమి, భవనాల లీజుల విషయంలో అనేక వివాదాలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంపై తనకేమీ సంబంధం లేకపోయినా విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకున్నారు. దీంతో గంటా శ్రీనివాసరావుకు కోపం వచ్చింది. ఫిల్మ్ క్లబ్ లీజుల విషయంలో గంటాతో పాటు మరికొంత మంది మధ్య చర్చలు జరుగుతున్నాయని ఈ సమయంలో విష్ణుకుమార్ రాజు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం యాధృచ్చికం కాదని చెబుతున్నారు.
గంటా శ్రీనివాసరావు ఆగ్రహాన్ని విష్ణుకుమార్ రాజు చల్లార్చే ప్రయత్నం చేశారు కానీ.. మరింత పెంచే ప్రయత్నం చేయలేదు. చివరికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు చెప్పడం ఏమిటని.. గంటా ఫీలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఫిల్మ్ క్లబ్ వివాదం కూటమి ఎమ్మెల్యేల మధ్య పెరుగుతుందా.. సర్దుబాటు చేసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.