సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా, అనవసర భయాందోళనలు రేగకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. మీడియా, సోషల్ మీడియాకు ప్రత్యేక గైడ్ లైన్స్ జారీ చేసింది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలు దిగుతున్న వేళ రక్షణపరంగా ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటుందని.. వాటిని కవరేజ్ విషయంలో అత్యుత్సాహం చూపించొద్దని స్పష్టం చేసింది.
జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసిది. ఇలా చేయడం వల్ల దేశానికి సంబంధించిన కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు శత్రువులు పసిగట్టే ప్రమాదం ఉందని గుర్తు చేసింది. భద్రతా సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను నివేదించేటప్పుడు అత్యంత బాధ్యత వహించాలని, ప్రస్తుత చట్టాలు ,నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
ప్రత్యేకంగా రియల్-టైమ్ కవరేజ్, దృశ్యాల ప్రసారం, రక్షణ కార్యకలాపాలు , సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారం బహిర్గతం చేయకూడదు. భద్రతా దళాలు చేసే ఏదైనా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఏ కేబుల్ సర్వీస్‌లో ప్రసారం చేయకూడదన్న రూల్ ఉంది. మీడియా కవరేజ్ సంబంధిత ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చిన బ్రీఫింగ్‌కు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.