కేసీఆర్ కేబినెట్లో కీలక మంత్రి హరీష్ రావు సత్తా ఏమిటో తెలిసిందే. ఏ రాచకార్యాన్నయినా చక్కబెట్టుకు రావడంలో దిట్ట. సమస్య వచ్చినప్పుడు కూల్ గా పరిష్కరించడంలో ఎంతో పరిణతి సాధించారు. గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన ఒక అంశాన్ని ఆయన చటుక్కున సెటిల్ చేసేశారు. సెటిల్ మెంట్ లో తనకు సాటిలేదని నిరూపించారు.
మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ వివాదం చాలా కాలంగా రగులుతోంది. ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. దీనిపై ఆందోళనలు జరిగాయి. దీక్షలు జరిగాయి. వివాదం రోజురోజుకూ ముదిరింది.
పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ముంపు రైతులకు అన్యాయం చేసేది లేదని హామీ ఇచ్చారు. తాము తెచ్చిన జీవో, లేదా 2013 చట్టం వీటిలో రైతులు కోరుకున్న ప్రకారం పరిహారం ఇస్తామన్నారు. అయినా వివాదం సద్దుమణగలేదు.
ప్రాజెక్టుకు భూములిచ్చే రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. చాలా మంది రైతులు ప్రతిపక్షాలతో కలిసి ఆందోళన చేశారు. అయితే మంగళవారం నాడు మంత్రి హరీష్ రావు ఏటిగడ్డ కిష్టాపూర్ వెళ్లారు. రైతలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. భూములు ఇచ్చే రైతుల కోరుకున్న ప్రకారం పరిహారం ఇస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇవ్వడానికి ఒప్పుకోవాలని కోరారు.
హరీష్ హామీలతో మెత్తబడిన రైతులు, తమకు ఎకరానికి 6 లక్షల రూపాయల పరిహారం ఇస్తే భూములు ఇస్తామని చెప్పారు. దీనికి హరీష్ రావు సరేనన్నారు. అంతే, వివాదం సెటిల్ అయిపోయింది. కాళేశ్వరం మెగా ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మల్లన్నసాగర్ వల్ల మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాలకు సాగు నీరు వస్తుందని, రైతులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెప్తోంది. మొత్తానికి కాంగ్రెస్, టీడీపీ, జేఏసీ వైఖరి ఎలా ఉన్నా, హరీష్ రావు ప్రయత్నం సఫలమైంది.