కశ్మీర్‌పై ఉగ్రవాదులు చేసిన టార్గెట్ బహుముఖమైనది. కశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదని ప్రపంచానికి సందేశం పంపడంతో ఓ వైపు అక్కడి ప్రజలు ఏ మాత్రం ఆర్థికంగా మెరుగుపడకుండా చూసి తమ గుప్పిట్లోనే ఉండేలా చూసుకోవాలనుకున్నారు. దానికి తగ్గ కుట్రల్ని అమలు చేశారు. ఇటీవలి కాలంలో ఏడాదికి రెండున్నర కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్ వెళ్లారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అది రెట్టింపు అవుతుంది. దీని వల్ల అక్కడి ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. కానీ ఇప్పుడు పెహల్గాం ఎటాక్ … వాటిపై బాంబులేసేసింది.
ప్రజల ఆదాయ వనరు టూరిజం
కశ్మీర్ భూతల స్వర్గం. మంచి వాతావరణం.. సెక్యూరిటీ సమస్యలు లేకపోతే మరో స్విట్జర్లాండ్లాగా ప్రపంచ ప్రఖ్యాత టూరిజం స్పాట్ అయ్యేది. అక్కడి ప్రజలకు ఏకైక ఆదాయవనరుగా కూడా టూరిజమే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత క్రమంగా టూరిజం ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోంది. హోటళ్లు.. ఇతర పర్యాటక ఉపాధి అవకాశాలు పెరిగాయి. అక్కడి వారు గుర్రాలు సహా గైడ్లుగా.. టాక్సీల నుంచి అనేక విధాలుగా పర్యాటకులకు సేవలు అందించి ఆర్థికంగా మెరుగుపడుతున్నారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉగ్రవాదుల దాడి జరిగింది.
బోసిపోతున్న కశ్మీర్ టూరిజం
ప్రస్తుతం కశ్మీర్ టూరిజం బోసిపోతోంది. ముందుస్తుగా హోటల్స్ నుంచి క్యాబ్‌ల వరకూ బుక్ చేసుకున్న వారు భయంతో క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో టూరిజం మీద ఆధారపడిన కశ్మీర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం ఆగిపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వంద శాతం పర్యాటకులు వెళ్లడం ఆపలేదు. పది శాతం మంది వెళ్తున్నారు. పహెల్గాంలోనూ పర్యాటకులు కనిపిస్తున్నారు. ఇప్పుడు వారి ధైర్యం మిగతా వారికి భరోసా ఇస్తోంది. కశ్మీర్ వెళ్లాలనుకునేవారు ధైర్యంగా బయలుదేరే పరిస్థితి కనిపిస్తోంది.
భద్రత కట్టుదిట్టం – అక్కడి ప్రజలకు టూరిస్టులు భరోసా కీలకం !
పెహల్గాం ఎటాక్ తర్వాత కశ్మీర్ మొత్తాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాద నెట్ వర్క్ లో ఉన్న వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. వారితో సంబంధాలు ఉన్న వారు ఎవరూ కనిపించడం లేదు. కుట్రదారులంతా.. పారిపోయారు. మరెవరైనా కుట్ర చేయాలనుకున్నా భయపడే పరిస్థితి వచ్చింది. నిజానికి కశ్మీర్ ముస్లింలు కూడా ఈ ఉగ్రవాదదాడిని ఖండించారు. లాల్ చౌక్ లో వారు పాకిస్తాన్ కు…ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇస్తున్నారు. అందుకే భారత టూరిస్టులు అందరూ కశ్మీర్‌కు వెళ్లాలి. అక్కడి ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వాలి. అప్పుడే కశ్మీర్ ప్రజలు మరింతగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మారుతారు.