శ్రీవారి ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిని కల్తీ చేశారని.. జంతువుల కొవ్వును ఉపయోగించారన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ విచారణ నెమ్మదిగా సాగుతోంది. అప్పడొకర్ని.. ఇప్పుడొకర్ని అరెస్టు చేస్తున్నారు. కానీ అసలు సూత్రధారుల వద్దకు వెళ్లడం లేదు. నిజానికి కల్తీ నెయ్యిపై పూర్తి ఆధారాలు లభించాయి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉంది.
ఇప్పటికీ పాత్రధారులనే సీబీఐ సిట్ పట్టుకుంది. తమిళనాడులోని ఏఆర్ డెయిరి, ఉత్తరాఖండ్‌లోని బోలెబాబా డెయిరీలకు చెందిన వారిని అరెస్టులు చేశారు. తాజాగా మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. వారు నెయ్యిలో ఏం కల్తీ చేశారు.. ఎవరు కల్తీ చేయమన్నారు.. కాంట్రాక్టులు ఎవరివి.. వారి వెనుక ఉన్నదెవరు అన్నది తేల్చి సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉంది. కానీ విచారణ ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఇంకా.. చిన్న స్థాయి వ్యక్తుల అరెస్టుల వద్దనే ఉంది.
అసలు మొత్తం నెయ్యి కల్తీ స్కాం సూత్రధారి భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన టీటీడీ చైర్మన్ గా వచ్చిన తర్వాతనే ఈ నెయ్యి టెండర్లు ఖరారు అయ్యాయి. అర్హతలేని కంపెనీలన్నీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు పొందాయి. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కుమారుడి ఎన్నికల ఖర్చు కోసం.. టీటీడీ నిధులతో పాటు.. ఇలా అక్రమాలకు పాల్పడి.. కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కాం మొత్తం సూత్రధారిని బయటకు లాగితే తప్ప.. సీబీఐ సిట్ కు సార్థకత ఉండదని అంటున్నారు.