గత కొన్ని వారాలుగా బాక్సాఫీసు దగ్గర సరైన హంగామా కనిపించడం లేదు. వారానికి ఏవో కొన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ… జనాలే థియేటర్లకు రావడం లేదు. ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమాపై గట్టిగా పడింది. అయితే క్రేజీ సినిమాలొచ్చినప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు తప్పకుండా వస్తారన్నది అందరి నమ్మకం. ఆ నమ్మకం నిజమో కాదో ఈవారం తేలిపోతుంది. ఎందుకంటే మే 1న రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఒకటి హిట్ 3, మరోటి రెట్రో.
హిట్ 1, హిట్ 2… ఈ ఫ్రాంచైజీలో వస్తున్న సినిమా… హిట్ 3. నాని ఈసారి హీరోగా, నిర్మాతగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. హిట్ వైబ్స్ కనిపిస్తున్న ప్రాజెక్ట్ ఇది. బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగుల జోరు బాగా కనిపిస్తోంది. మే 1 గురువారం.. సెలవు. కాబట్టి లాంగ్ వీకెండ్ ఛాన్స్ దొరికింది. గురువారం మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. హిట్ టాక్ కూడా వచ్చేస్తే… ఇక తిరుగు ఉండదు. టీజర్, ట్రైలర్ కట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. హింస ఎక్కువగా కనిపిస్తోంది. నానికి ఫ్యామిలీ ఆడియన్స్ వరం. వాళ్లు ఈ సినిమాకు వచ్చే ఛాన్స్ వుండదు. నాని నమ్ముతోంది కూడా… యూత్ నే. వాళ్లే ఈ సినిమాని గెలిపిస్తారని చూస్తున్నాడు.
సూర్య – కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో రూపుదిద్దుకొన్న సినిమా ‘రెట్రో’. సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ వుంది. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా అంటే ఓ వర్గం ఎదురు చూస్తుంటుంది. రెట్రో టైటిల్, కాన్సెప్ట్… అన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. సూర్య సినిమాలకు ఎప్పుడూ తెలుగునాట ఓపెనింగ్స్ బాగుంటాయి. ఈసారి కూడా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెడతారన్న నమ్మకం వుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. తన గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది.
చాలా రోజుల తరవాత ఈ వారం బాక్సాఫీసు దగ్గర కాస్త సందడి కనిపించే అవకాశం ఖాయంగా వుంది. అయితే… అది ఈ వారాంతం కూడా ఉంటుందా? లేదా? అనేది ఈ రెండు సినిమాల ఫలితాల్ని బట్టి ఆధారపడి ఉంటుంది.