ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కరెక్షన్ లో ఉంది. 2014-19 మధ్య వచ్చిన బూమ్ . . ఆ తర్వాత వచ్చిన వైసీపీ పాలన కారణంగా అతివృష్టి, అనావృష్టిని చూశాయి. గతంలోలా కాకుండా ఇప్పుడు మెల్లగా అన్ని ప్రాంతాల్లోనూ కోలుకుంటున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పలు చోట్ల ముఖ్యంగా అమరావతికి కనెక్ట్ అయ్యే చోట్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూమ్ క్రమంగా పెరుగుతోంది.
2014-19 ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు వెలిశాయి. ప్రతి గ్రామంలో వందలాది ఎకరాలు చేతులు మారాయి. వైసీపీ పాలన వల్ల అవన్నీ ఎక్కడివక్కడే ఉండిపోయాయి. లావాదేవీలు లేకుండా పోయాయి. ఎన్నికలకు ముందు నుంచి మళ్లీకాస్త ఉత్సాహం కనిపిస్తోంది. క్రమంగా పెరుగతూ వస్తోంది. ఇప్పుడు రియల్ బ్రోకర్లు బిజీ అయిపోయారు. కొనుగోలుదారుల పర్యటనలతో కంచికచర్ల రియల్ ఎస్టేట్ కళకళలాడుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత పరిటాల బైపాస్ రోడ్డులో ఎకరం నాలుగు కోట్ల వరకూ చేరింది. ఇతర ప్రాంతాల్లో అటూ ఇటూగా.. రెండు కోట్ల వరకూ పలుకుతున్నాయి. కంచికచర్ల మీదుగా వెళ్లే అమరావతి-ఎర్రుపాలెం రైల్వే లైనుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంచికచర్లను ఆనుకుని వెళ్లే అవుటర్ రింగు రోడ్డు నిర్మాణం ప్రారంభం కానుంది. దాములూరు-వైకుంఠపురం రిజర్వాయర్ కమ్ బ్రిడ్జి కంచికచర్లకు సమీపంలోనే ఉంది. ఆరులైన్లుగా జాతీయ రహదారి విస్తరించనున్నారు.
ఈ క్రమంలో మళ్లీ వెంచర్ల వద్ద కనుగోలు దారులు కనిపిస్తున్నారు. ఇప్పటికి పెట్టుబడి రూపంలోనే కంచికచర్ల రియల్ ఎస్టేట్ ఉంది. మరో నాలుగైదేళ్ల తర్వాత హౌసింగ్, వాణిజ్య కలాపాల కేంద్రంగా మారవచ్చన్న అంచనాలు ఉన్నాయి.