తెలంగాణా ప్రభుత్వం నిర్మించతలబెట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ క్రింద 14 గ్రామాలు ముంపుకి గురవుతాయి కనుక దాని కోసం 20,079 ఎకరాలని సేకరించవలసి ఉంది. నిర్వాసితులకి ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ, నిర్వాసితులతో కలిసి దీక్షలు, ధర్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ప్రకారం కాకుండా భూసేకరణ చట్టం-2013 ప్రకారమే నిర్వాసితులకి పరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. నిర్వాసితులు ఏవిధంగా కోరుకొంటే ఆ విధంగా నష్టపరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇస్తున్నప్పటికీ, ప్రతిపక్షాల జోక్యంతో నిర్వాసితులలో అయోమయం నెలకొని ఉంది. నష్టపరిహారం, పునరావాసం విషయంలో నిర్వాసితులలో ఏర్పడిన అపోహలు తొలగించడానికి మంత్రి హరీష్ రావు స్వయంగా సోమవారం ముంపు గ్రామాలైన ఏటిగడ్డ కిష్టాపూర్,తిరుమలగిరి,ఎర్రవెల్లి, లక్ష్మాపూర్ ప్రజలను స్వయంగా కలిసి మాట్లాడి ఎకరాకి రూ.6 లక్షల పరిహారం, వేరే ప్రాంతంలో మళ్ళీ అందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడంతో, ప్రాజెక్టు కోసం తమ భూములు ఇవ్వడానికి గ్రామస్తులు అంగీకరించారు. నేటి నుంచి వారి భూములను ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ మొదలుకావలసి ఉంది. కానీ మళ్ళీ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు నిన్న రాత్రి సమావేశమయ్యి ప్రాజెక్టుకి భూములు ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించడంతో కధ మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. ఆ ప్రభావంతో మిగిలిన గ్రామాల ప్రజలు కూడా వెనకడుగువేస్తే మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిల శ్రమ వృధా అయినట్లే.
హరీష్ రావు ఇచ్చిన హామీలతో పూర్తి సంతృప్తి వ్యక్తం చేసి భూములు ఇవ్వడానికి అంగీకరించిన రైతులు, మళ్ళీ రాత్రి గ్రామంలో సమావేశమయ్యి భూములు ఇవ్వబోమని తీర్మానం చేయడం చాల విచిత్రంగా ఉంది. వారు ప్రతిపక్ష పార్టీల ప్రభావానికి లేదా ఒత్తిళ్ళకి లోనయినందునే ఆవిధంగా చేసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి హరీష్ రావు స్వయంగా రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ వారికి నష్టపరిహారం, పునరావాసం లేదా మరేదయినా విషయంలో అభ్యంతరాలు ఉన్నట్లయితే, వారు నేరుగా ఆయనతోనే మాట్లాడి తమ సమస్యలని పరిష్కరించుకోవచ్చు. కానీ ప్రతిపక్షాలతో కలిసి రాజకీయాలు చేయడం వలన చివరికి వారే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా నిర్వాసితులని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ అభివృద్ధి పనులను అడ్డుకొంటున్నట్లయితే, వాటిపై ప్రజలకి దురాభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని గ్రహిస్తే మంచిది. కనుక నిర్వాసితులకి న్యాయం జరగడం కోసం వారికి తగిన సలహాలు, సహకారం అందించడం వరకే పరిమితం అయితే మంచిది.