మే1న ‘హిట్ 3’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈలోగా నాని ప్రమోషన్ల జోరు పెంచాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి రాజమౌళికి తీసుకొచ్చి… ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయగలిగాడు. ఈ సినిమా ఆదివారమే నాని చూసేశాడు. అవుట్ పుట్ పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. పవన్ కల్యాణ్ స్టైల్ లో ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ అభిమానుల్ని మరింత ఉత్సాహపరిచాడు. సినిమాపై ఎంత నమ్మకం ఉన్నా.. తన వంతు జాగ్రత్తలు తాను తీసుకొంటున్నాడు నాని. ముఖ్యంగా రన్ టైమ్ విషయంలో నాని చాలా పర్టుక్యులర్గా ఉన్నట్టు తెలుస్తోంది.
‘హిట్ 3’ రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలు. ఇది బేసిక్ రన్టైమే. అయితే… ఈ సినిమాని ఇంకాస్త ట్రిమ్ చేయబోతున్నార్ట. ఈరోజు దర్శకుడు శైలేష్ కొలను అదే పనిలో ఉన్నాడని టాక్. కనీసం 5 నుంచి 8 నిమిషాల ట్రిమ్మింగ్ ఉంటుందని తెలుస్తోంది. సినిమా ఎంత షార్ప్ గా ఉంటే అంత బాగా నచ్చుతోంది జనాలకు. నాని గత సినిమా ‘అంటే సుందరానికి’ రన్ టైమ్ విషయంలో ఇబ్బంది ఎదురైంది. అది మరీ 3 గంటల సినిమా. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని నాని ‘హిట్ 3’ని మరింత షార్ప్ గా కట్ చేయిస్తున్నాడన్నమాట. మే 1న నాని `హిట్ 3`తో పాటుగా సూర్య ‘రెట్రో’ కూడా విడుదల అవుతోంది. అయితే తెలుగు నాట ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగులు జోరుగా ఉన్నాయి. ఈసారి తమిళ, మలయాళ, హిందీ సీమల్లోంచి కూడా `హిట్ 3`కి మంచి వసూళ్లు దక్కే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి.