సాంకేతికరంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నవారిలో ఎక్కువగా భారతీయులు ఉన్నారని, అందులో తెలుగువారు ఉంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సిలికాన్ వంటి టెక్నాలజీ కేంద్రాల్లో ప్రముఖ సంస్థలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు.
అమరావతిలోని విట్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. నూతన స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ‘వి-లాంచ్ ప్యాడ్ 2025’ ఇంక్యుబేషన్ సెంటర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడే భవిష్యత్ అంతా ఐటీదేనని ఆరోజుల్లోనే చెప్పినట్లు గుర్తు చేశారు. దీనికి కొనసాగింపుగా హైటెక్ సిటీని కేవలం 14నెలల్లోనే పూర్తి చేసినట్లు తెలిపారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని గుర్తు చేశారు. కాలం మారిందని, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ కీలకంగా మారాయని అన్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్ ఉద్యోగానికి కూడా తీవ్ర పోటీ ఉండేదన్న ఆయన, నేడు ఐటీ రంగంలో ఉద్యోగాలకు యూత్ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
విట్ అమరావతిలో 95శాతం ప్లేస్ మెంట్లు వస్తున్నాయి. అయినా ఉద్యోగంతో సంతృప్తి చెందవద్దని, కొత్త సంస్థలను స్థాపించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.