ప్రస్తుత రాజకీయ పరిణామాలతో కేసీఆర్, కమలం పార్టీ మద్దతు కోరుతున్నారా ? అసలే సోషల్ మీడియా ఊపును చూసి బలుపు అనుకుంటున్న బీఆర్ఎస్ కు భవిష్యత్ ఉండాలంటే జాతీయ పార్టీ అండదండలు ఉండాలని భావిస్తున్నారా? బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని కుట్రలు చేశారని పార్టీ రజతోత్సవ సభలో ఆరోపించిన కేసీఆర్, బీజేపీని టార్గెట్ చేయకపోవడం వెనక బలమైన కారణం ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
కేసీఆర్ ప్రసంగంపై ఎన్నో అంచనాలు..బీఆర్ఎస్ పొలిటికల్ జర్నీపై మరెన్నో అనుమానాలు.. వెరసి పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ అదరగొడుతారని, సందేహాలను పటాపంచలు చేస్తారని విస్తృత ప్రచారం కొనసాగింది. గులాబీ అధినేత ప్రసంగం ఆ అంచనాలను అందుకోలేకపోగా.. మరెన్నో అనుమానాలను తెరమీదకు తీసుకొచ్చింది. తన స్పీచ్ ఆద్యంతం కేసీఆర్ కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేశారు. బీజేపీకి మాత్రం చిన్న టచప్ ఇచ్చి వదిలేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
సోషల్ మీడియాలో బలం కనిపిస్తున్నా బీఆర్ఎస్ కు గ్రౌండ్ లో బలం పెరిగిందా అంటే అనుమానమే. కానీ, బీజేపీ మాత్రం గ్రౌండ్ లో బలంగా పుంజుకుంది. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కొంత బీజేపీ అకౌంట్ లోకి షిఫ్ట్ అవ్వడమే. బీజేపీ అధినాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం బీఆర్ఎస్ ను కొంత కలవరపాటుకు గురి చేసేదే. ఈ సమయంలో కాంగ్రెస్ , బీజేపీపై సమాంతర విమర్శలు చేయాల్సిన కేసీఆర్.. కేవలం హస్తాన్ని,గాంధీ ఫ్యామిలీని మాత్రమే టార్గెట్ చేయడం వెనక రీజన్ ఏంటన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే బీఆర్ఎస్ – బీజేపీ ఒకటేనే ప్రచారాన్ని కాంగ్రెస్ ఇంకా వాడుకలో ఉంచుతోంది. అయినప్పటికీ పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని ఒక్క ఆపరేషన్ కగార్ మినహా ఎక్కడా కేసీఆర్ టార్గెట్ చేయలేదు. ఇది బీఆర్ఎస్ బలహీనతకు నిదర్శమని, అవసరమైతే బీజేపీతో చెలిమి ఉంటుందనే దూరదృష్టి వలెనే కేసీఆర్ బీజేపీని విమర్శించలేదనే కాంగ్రెస్ చేస్తున్న వాదనకు బలం చేకూర్చేదే. కాంగ్రెస్ , బీజేపీలపై ఎదురుదాడి చేసి నోరుమూయిస్తారని బీఆర్ఎస్ శ్రేణులన్నీ గంపెడు ఆశలు పెట్టుకుంటే.. కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ పై ఎటాక్ చేసేలా కాంగ్రెస్ కు చాన్స్ ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.