శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ బాగుంటుంది. తాను కామెడీని నమ్ముకొన్న సినిమాలన్నీ మంచి ఫలితాల్ని అందించాయి. ఇప్పుడు అదే జోనర్లో ఓ సినిమా చేశాడు. అదే ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకుడు. కేతిక శర్మ, ఇవానా కథానాయికలు. మే 9న విడుదల కానుంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
2 నిమిషాల 30 సెకన్ల ట్రైలర్ ఇది. సింహభాగం శ్రీవిష్ణు కామెడీ పంచ్‌లతోనే సాగింది. ‘అమ్మాయిలు మూడు రకాల అబ్బాయిల్ని ఇష్టపడతారు..’ అనే డైలాగ్‌తో ఫన్ రైడ్ మొదలైంది. చివర్లో వెన్నెల కిషోర్.. ‘ఎంత రిచ్ అయినా హచ్ అనే తుమ్మాలి.. రిచ్ అని తుమ్మడు’ అంటూ నాన్ సింక్ డైలాగుతో.. మరోసారి గిలిగింతలు పెట్టిస్తాడు. ఈమధ్యలో చాలా గమ్మత్తులు జరిగాయి. బాలయ్య, మంచు విష్ణు డైలాగుల్ని, వాళ్ల మేనరిజాల్ని వాడేశాడు శ్రీవిష్ణు. అవన్నీ ఫన్నీగా అనిపిస్తాయి. శ్రీవిష్ణు లుక్ బాగుంది. తన డైలాగ్ డెలివరీతోనే కామెడీ పండుతోంది. తనకు వెన్నెల కిషోర్ తోడయ్యాడు. లైట్ హార్టెడ్ కథలు ఈమధ్య మంచి విజయాల్ని అందుకొంటున్నాయి. సరదాగా నవ్విస్తూ, చివర్లో కాస్త ఎమోషనల్ టచ్ ఇస్తే హిట్ కొట్టేసినట్టే. ఈ సినిమాలో ఎమోషన్‌కీ స్కోప్ ఉన్నట్టు అర్థం అవుతోంది. గీతా ఆర్ట్స్ సమర్పణలో వస్తున్న సినిమా ఇది. మేకింగ్ లో క్వాలిటీ కనిపిస్తోంది. మొత్తానికి ఈ వేసవిలో కాలక్షేపానికి ఢోకా లేని ఓ సినిమా వస్తోందన్న భరోసా ఈ ట్రైలర్‌తో కలిగినట్టైంది.