తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేల విషయంలో అంత సంతృప్తిగా లేరు. వారు ప్రజలకు వద్దకు వెళ్లడం లేదని… హైదరాబాద్లోనే టైం పాస్ చేస్తున్నారని ఆయన ఫీలవుతున్నారు. అదే సమయంలో పదవుల కోసం ధిక్కరణ వ్యాఖ్యలు చేస్తూండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి .. తనను నమ్ముకుంటే మేలు జరుగుతుందని సలహా ఇచ్చారు.
అద్దంకి దయాకర్ ను రేవంత్ రెడ్డి ఉదాహరణగా చూపించారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇప్పిస్తానని హామీ ఇచ్చానని ఇప్పించాన్నారు. పదవులు రాని వాళ్లు ఓపికగా ఉండాలని.. తొందరపడితే నష్టపోతారని హెచ్చరించారు. సీఎల్పీ సమావేశం పెట్టి ఎమ్మెల్యేలను ప్రజల్లోకి వెళ్లాలని చెప్పినా వెళ్లడం లేదని.. కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటిపోయారని రేవంత్ స్పష్టం చేశారు. వారు మారకపోతే భవిష్యత్ ఉండదని కూడా స్పష్టం చేశారు.
అదే చిట్ చాట్లో కేసీఆర్ పై రేవంత్ విమర్శలు చేశారు. ఎల్కతుర్తి సభలో అక్కసుతోనే కేసీఆర్ మాట్లాడారని.. ఖజానాను లూటీ చేసి.. ఇప్పుడు ఏమీ చేయడం లేదని కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు. తాను ముఖ్యమంత్రి అయిన రెండో రోజునే కేసీఆర్ గుండె పగిలిందన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి తన పాలనపై చర్చ జరుగుతుందని. ఇప్పుడు చేసే ప్రచారం అంతా ఉత్తదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు మరో ఐదేళ్లు అవకాశం ఇస్తారని రేవంత్ గట్టి నమ్మకంతో ఉన్నారు.