చైనా – అమెరికాల మధ్య టారిఫ్ వార్ ఇంకా చల్లారనేలేదు. తగ్గేదేలే అంటూ రెండు దేశాలు పోటాపోటీగా టారిఫ్ లు విధించుకున్నాయి. దీంతో అగ్రరాజ్యాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తనతో ఫోన్ మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ కొనసాగుతున్న వేళ ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచ దేశాలను విస్తుపోయేలా చేసింది. వెంటనే చైనా ట్రంప్ చేసిన ప్రకటనను ఖండించింది. ఇటీవలి కాలంలో ట్రంప్ తో జిన్ పింగ్ తో ఎలాంటి సంభాషణ జరపలేదని వెల్లడించారు.
గతవారం ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జిన్ పింగ్ గురించి ప్రస్తావించారు డొనాల్డ్ ట్రంప్. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోన్ చేశారు. కానీ, ఈ అంశంపై నేను స్పందించాలని అనుకోవడం లేదు. గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం అని ట్రంప్ తెలిపారు.
అయితే, ట్రంప్ తో జిన్ పింగ్ ఎప్పుడు ఫోన్ లో మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? ఏ అంశంపై చర్చించారు అనే విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గుయో జియాకున్ స్పందించారు.
తనకు తెలిసినంత వరకు ఇటీవలి కాలంలో రెండు దేశాలకు చెందిన అధ్యక్షులు ఫోన్ కాల్ లో మాట్లాడుకోలేదు. టారిఫ్ లపై చర్చించేందుకు ఇరు దేశాల మధ్య ఎలాంటి సంప్రదింపుల ప్రక్రియ కూడా జరగలేదని స్పష్టం చేశారు.