మమ్మల్ని చంపవద్దు ప్లీజ్.. షరతులు లేకుండా శాంతి చర్చలకు వస్తాం అని మావోయిస్టులు పదే పదే లేఖలు రాస్తున్నారు. కానీ ఇలాంటి లేఖలను కేంద్రం అసలు పట్టించుకోవడం లేదు. వచ్చే మార్చికల్లా నక్సలైటు అనేవాడు లేకుండా అంతం చేస్తామని కేంద్రం పట్టుదలగా ఉంది. ఆ ప్రకారమే ముదుకెళ్తోంది. పదుల సంఖ్యలో ఎన్ కౌంటర్లలో చనిపోతున్నారు. కానీ జనం నుంచి స్పందన లేదు. నక్సలైట్లు ప్రస్తుత సమాజానికి అవసరం లేదని అంతా నిర్ణయానికి వచ్చేశారు. ఫలితంగా వారి కోసం మాట్లాడేవారు కూడా లేదు. ప్రాణాలు పోతున్నా.. వారిపై సానుభూతి ఉన్నా దీనంగా చూస్తూండటమే మిగిలింది.,
వందల మంది మావోయిస్టుల హతం
గత ఏడాది నుంచి సాగుతున్న ఆపరేషన్ కగార్ కారణంగా అధికారికంగానే ఏడు వందల మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో అగ్రనేతలు ఉన్నారు. కింది స్థాయి క్యాడర్ ఉన్నారు. చత్తీస్ ఘడ్ , బెంగాల్, ఏవోబీలలో ఒకప్పుడు మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవారు. కానీ ఇప్పుడు తమను తాము కాపాడుకోవడానికి గుట్టల్లో దాక్కోవాల్సి వస్తోంది. పోలీసు బలగాలు వచ్చి చంపకపోయినా ఆకలితో అలమటించి మిగిలిన వారు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భయంతో లొంగిపోతున్న వందల మంది మావోయిస్టులు
ఎదురుపడితే కనికరం లేకుండా చంపేయడం ఖాయమని తేలిపోవడంతో పలు ప్రాంతాల నుంచి మావోయిస్టులు లొంగిపోతున్నారు. వారికి పోలీసులు ఆ అవకాశం కల్పిస్తున్నారు. కానీ కొంత మంది కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో చుట్టూ మందుపాతరలు పెట్టుకుని లోపల కూర్చున్నామని ఎవరూ రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలా చెబితే పోలీసులు ఊరుకుంటారా?. వేట సాగిస్తున్నారు.. మావోయిస్టుల్లో చివరి వ్యక్తి వరకూ అంతం చేసిన తర్వాతే బలగాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.
ఎన్కౌంటర్లను పట్టించుకోవడం మానేసిన ప్రజలు
ఒకప్పుడు ఇద్దరు, ముగ్గురు నక్సలైట్లను ఎన్ కౌంటర్ చేస్తే గగ్గోలు రేగేది. బూటకపు ఎన్ కౌంటర్ అని విమర్శలు వచ్చేవి. ప్రభుత్వం కనీసం ప్రజాస్వామ్యవాదుల కోరిక తీర్చడానికి విచారణకు అయినా ఆదేశించేది. దానికి కారణం ప్రజల్లో వారి పట్ల ఎంతో కొంత సానుభూతి ఉండటంవల్లనే. ఇప్పుడు నక్సలైట్లు ఎన్ కౌంటర్ అయిపోతున్నా ప్రజల్లో స్పందన లేదు. అందుకే ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. ధైర్యంగా ఎన్ కౌంటర్రు చేసేస్తున్నాయి. మావోయిస్టుల సానుభూతిపరులుగా ఉండి.. బయట సమాజంలో ఉన్న వారికీ ఓపిక ఉండటం లేదు. ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడలేకపోతున్నారు.
ఇప్పటికి సమాజానికి నక్సలిజం అక్కర్లేదు!
నక్సలిజం అంటే ఒకప్పుడు.. దేశభక్తి అనుకునేవాళ్లు. ఎన్టీఆర్ లాంటివాళ్లు నక్సలైట్లు దేశభక్తులే అన్నారు. అప్పట్లోఅది నిజమే కానీ ఇప్పటి సమాజానికి నక్సలిజం అవసరం లేదు. అడవుల్లో ఉండి తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అంటేనే పెద్ద కామెడీ అవుతుంది. బయట ప్రజల్లోఉండి పోరాడాల్సిన కాలం వచ్చింది. కానీ మావోయిస్టులు మారలేదు. అందుకే అంతం చేస్తున్నారు. ప్రజలూ పట్టించుకోవడం లేదు.