ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా పార్లమెంట్ లో చట్టం చేయించి, గెజిట్ జారీ చేయించాలని అమరాతి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియడంతో ఇక అడ్డంకులు ఉండవని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తూండటంతో ఈ మేరకు అమరాతి గెజిట్ విడుదల చేయించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేయనుంది.
రాజధానిపై కుట్రలు – ఏపీ దౌర్భాగ్యం
ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన రాజధాని అమరావతి. చట్టసభలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా మాట తప్పే రాజకీయ నాయకుల నిర్వాకం వల్ల రాజధానికి గడ్డు పరిస్థితి ఏర్పడింది. సొంత రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నామన్న ఇంగితం లేకుండా పాలకులు చేసిన తప్పిదం కారణంగా ఏపీ రాజధాని అది అన్న ప్రశ్న ఐదు సంవత్సరాల పాటు వెంటాడింది. ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వారు మారలేదు. మళ్లీ వస్తే అమరావతిని మార్చేస్తాం, కూల్చేస్తామన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఏపీ దౌర్భాగ్యమే అనుకోవచ్చు.
ప్రజారాజధాని అమరావతి
గత ఎన్నికల్లో వైసీపీ మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. కూటమి ప్రభుత్వం అమరావతే ఏకైక రాజధాని అని అటు కర్నూలులోనూ..ఇటు విశాఖలోనూ చెప్పింది. ఈ మేరకు ప్రజల నుంచి ఏకపక్ష మద్దతు లభించింది. ఇలాంటి తీర్పుతో అయినా విపక్షం మారి.. ప్రజాతీర్పునకు అనుగుణంగా వ్యవహిరంచాల్సి ఉంది. కానీ అలాంటి లక్షణాలు వారిలో లేవు. అందుకే.. రైతులు గెజిట్ కోరుకుంటున్నారు.
రైతుల డిమాండ్ సహజమైనదే !
రహదారి విస్తరణ కోసం రెండు ఎకరాలు సమీకరించాలంటే.. ప్రస్తుత రోజుల్లో ఎంత కష్టం అవుతుందో… అందరూ చూస్తున్నారు. అలాంటిది వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. భవిష్యత్ కోసం.. అమరావతి కోసం.. ఏపీ కోసం ఇచ్చారు. ఏపీతో పాటు తాము ఎదుగుదామనే ఇచ్చారు. అమరావతి అభివృద్ధి చెందితేనే వారూ అభివృద్ధి చెందుతారు. లేకపోతే లేదు. అందుకే.. రైతుల త్యాగానికి భరోసా ఇవ్వాలంటే గెజిట్ ఇప్పించాల్సిందే. వీలైనంత త్వరగా అమరావతిని పూర్తి చేయాల్సి ఉంటుంది.