భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణను పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఆయన నాలుగు దశాబ్దాలుగా బీజేపీలో ఉన్నారు. పార్టీ కి బలం లేకపోయినా.. ఆయన బలంగా ఉండేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితమే మున్సిపల్ చైర్మన్ అయినా… తర్వాత కౌన్సిలర్ గా కూడా గెలవలేకపోయినా ఆయన బీజేపీని వీడలేదు. ఆయన పార్టీ విధేయతకు గుర్తింపు వచ్చింది.
గతంలో చంద్రబాబును విమర్శించారని టీడీపీ సోషల్ మీడియా కామెంట్స్
కానీ పాక వెంకట సత్యనారాయణ ఎంపికపై టీడీపీ సోషల్ మీడియాలో కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై గతంలో విమర్శలు చేశారని.. సాక్షి టీవీలో కేఎస్ఆర్ షోలో కూర్చుని జగన్ ను పొగిడి..చంద్రబాబును ప్రశంసించేవారని వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఆయనను మరే టీవీ చానల్ పిలవదు. పిలిచే టీవీ సాక్షి. ఎందుకంటే వారికి తగ్గట్లుగా మాట్లాడతారని పిలుస్తారు. వారి అంచనాలను ఆయన అందుకుని ఉంటారు. కానీ ఆ విమర్శలు ఎన్డీఏలో టీడీపీ లేనప్పుడే చేశారు.కూటమిగా ఏర్పడినప్పుడు చేయలేదు.
గతంలో బీజేపీని టీడీపీ నేతలు విమర్శించలేదా ?
బీజేపీ కూటమిలో లేనప్పుడు.. టీడీపీ నేతలు చాలా సార్లు మోదీని విమర్శించారు. 2019 ఎన్నికలకు ముందు ఘోరమైన విమర్శలు చేశారు. అయినా బీజేపీ అవేమీ పట్టించుకోలేదు. బాలకృష్ణకు పద్మభూషణ్ ఇచ్చారు. ఆయన మోదీపై గతంలో అసభ్యంగా మాట్లాడారు. ఆ మాటలు నేషనల్ మీడియాలో వైరల్ అయ్యాయి . రాజకీయాల్లో ఉన్నప్పుడు.. తమ పార్టీకి అనుకూలంగా మాట్లాడుకోవడం సహజం. ప్రత్యర్థి పార్టీలను విమర్శించడం సహజమే. రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించినప్పుడు.. వారు గతంలో మమ్మల్ని విమర్శించారు అని వెదుక్కుని ఫీల్ కావడం కంటే పిచ్చి పని ఏమి ఉంటుంది.
పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారికి బీజేపీ గుర్తింపు !
బీజేపీ హైకమాండ్.. ఇతర రాష్ట్రాల నుంచి నేతల్ని దిగుమతి చేయకుండా..లోకల్లో .. పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్న వారి.. ఇక అవకాశాలు రావు అనుకున్న వారికి చివరి సారిగా అవకాశాలు కల్పిస్తోంది. అలాంటి నెట్ వర్క్ ఉన్న బీజేపీ..క్యాడర్ ను గౌరవిస్తోందని అనుకోవచ్చు. ఆ పార్టీ ఎవర్ని అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నా.. టీడీపీ క్యాడర్ ఫీల్ కావాల్సిన పని లేదు.