ఐపీఎల్లో పద్నాలుగేళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ప్రపంచరికార్డులు సృష్టించాడు. తొలి మ్యాచ్‌లో ధాటిగా ఆడినా అర్థ సెంచరీ వరకూ వెళ్లలేకపోయానన్న బాధతో కన్నీరు పెట్టుకున్న సూర్యవంశీ..దాన్ని పట్టుదలగా మార్చుకున్నాడు. తర్వాత మ్యాచ్‌లో 35 పరుగులకే సెంచరీ చేసి.. రాజస్థాన్ రాయల్స్ కు విజయం అందించాడు. సూర్యవంశీని మొదటి నుంచి ఓపెనర్ గా ఎందుకు దింపలేదని ఇప్పుడు ఆర్ ఆర్ టీం మధనపడే పరిస్థితి వచ్చింది. ఇక వరుస విజయాలు సాధించినా.. ప్లే ఆఫ్‌కు వెళ్లడం కష్టమన్న స్థాయిలో ఆర్ ఆర్ ఉంది.
అయితే భారత క్రికెట్‌కు ఐపీఎల్ మరో జెమ్‌ను అందించిందని అనుకోవచ్చు. పధ్నాలుగేళ్ల వయసులో ఎలాంటి బెరుకు లేకుండా బౌలర్లను ఎదుర్కొన్న వైనం.. సాధికారికంగా కొట్టిన షాట్లు .. క్రికెట్ పండితుల్ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. కుర్రాడే కానీ మాస్టర్ లాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను భారత జట్టులోకి రావడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చునని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. బీహార్ కు చెందిన వైభవ్.. ప్రస్తుతం ఎనిమిదో తరగతి పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు చదువు కన్నా.. క్రికెట్లోనే పీజీ చేయాల్సి వస్తుంది.
భారత క్రికెట్ అంటే చిన్న విషయం కాదు. ఆటగాళ్ల ప్రతిభపై… టన్నుల కొద్ది ఒత్తిడి ఉంటుంది.దాన్ని అధిగమించి ఆడటమే కీలకం. చిన్న కుర్రాడు అయినా అలాంటి ఒత్తిడిని అలవోకగా మోస్తున్నాడు. ఏ మాత్రం భయం.. బెరుకు లేకుండా ఆట ఆడుతున్నాడు. రానున్న రోజుల్లో కూడా ఇలానే కొనసాగితే..భారత క్రికెట్‌కు మరో సచిన్, కోహ్లీ అయినా ఆశ్చర్యం ఉండదు. ఇందు కోసం వైభవ్ చేయాల్సింది చాలా ఉంది…కానీ ఆయనకు ఆ సామర్థ్యం ఉందని మాత్రం మొదటి రెండు మ్యాచుల్లోనే నిరూపించాడు.