ఉత్తరాంధ్రలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో యలమంచిలి ఒకటి. విశాఖకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ.. అభివృద్ధి కి మంచి స్కోప్ ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందుతోంది. ఇప్పటికే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉంది. అందుకే దీన్ని విశాఖ శివారుగానే అంచనా వేయడం ప్రారంభించారు. విశాఖలో ఉద్యోగానికి అప్ అండ్ డౌన్ చేయడానికి కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. విశాలమైన రహదారి సౌకర్యం ఉంది.
ఎలమంచిలి ప్రాంతం ప్రధానంగా వ్యవసాయ ఆధారితం. అయితే ఇప్పుడు అక్కడ ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల, ఎలమంచిలిలో గృహ నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండటంతో ఎక్కువగా కొనుగోల్లు చేస్తున్నారు. అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ లో బ్రాండిక్స్ వంటి దుస్తుల కర్మాగారాలు ఉపాధి కల్పిస్తున్నాయి, ఇది రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను మరింత పెంచింది.
యలమంచిలిలో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు విశాఖపట్నంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. పారిశ్రామిక , వాణిజ్య అభివృద్ధి వల్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఎలమంచిలి లో రూ. 2.20 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి, వీటిలో రహదారులు, కల్వర్ట్లు, ,డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు పెరిగితే ఆటోమేటిక్ గా విలువ పెరుగుతుంది.
అనకాపల్లి జిల్లాలో త్వరలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. దాదాపుగా లక్షన్నర కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనున్నారు. దీని వల్ల ఎలమంచిలి ప్రాంతంలో మరింతగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు అక్కడ స్థలాలు కొనుగోలు చేసేవారికి… ఐదేళ్లలో ఊహించనంతగా రిటర్న్స్ వస్తాయని భావిస్తున్నారు.