కష్టపడు – ఫలితం ఆశించకు అని అర్థం వచ్చే భగవద్గీత సూక్తిని ట్విట్టర్లో పోస్ట్ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిమి స్మితా సబర్వాల్ నాలుగు నెలల తన టూరిజం శాఖలో ప్రోగ్రెస్ రిపోర్టును ట్విట్టర్ లో పోస్టు చేశారు. నాలుగు అంటే నాలుగు నెలల్లోనే తాను గొప్ప పురోగతి సాధించానని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అయినా బదిలీ చేశారన్న అర్థంలో భగవద్గీత బోధ పోస్టు చేశారు.
నిజానికి ఆమెకు అత్యంత ఇష్టమైన మిస్ వరల్డ్ పోటీలు టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పోటీల నిర్వహణ కోసం ఆమె కష్టపడుతున్నారు. స్వయంగా ఫ్యాషన్ పై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న అధికారిణి కావడంతో మోడల్స్ , అందాల భామలతో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వారితో పోటీ పడుతున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అందాల పోటీల్ని అంతే అద్భుతంగా నిర్వహించి.. తెలంగాణ టూరిజాన్ని గొప్పగా ప్రమోట్ చేసే ప్రణాళికలు వేసుకున్నారు.
కానీ అసలు పోటీకి ప్రారంభం కావడానికి వారం రోజుల ముందే ఆమె బదిలీ అయ్యారు. దీంతో టూరిజంతో పని లేకుండా పోయింది. అందుకే ఆమె నిరాశకు గురయ్యారు. నిజానికి గత ప్రభుత్వ పెద్దలతో ఎంత సన్నిహితంగా ఉన్నా..కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఆసక్తి చూపించకపోయినా.. కొద్ది రోజుల తర్వాత ఆమెకు టూరిజం లాంటి ప్రాధాన్యత పోస్టింగ్ దక్కింది. కానీ కంచ గచ్చిబౌలి ఏఐ ఫోటోలను షేర్ చేసుకుని ప్రభుత్వంతో తన సంబంధాలను పూర్తిగా చెడగొట్టుకున్నారు. ఇప్పుడు టూరిజం నుంచి బదిలీ అయ్యారు.