పవర్ ఫుల్ ఆఫీసర్ గా పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. వైసీపీ హయాంలో తన సీనియార్టీ , ప్రతిష్టలను పక్కనపెట్టేసి జగన్ సైనికుడిగా మారడంతో అందుకు శిక్షను అనుభవిస్తున్నారు. సినీ నటి జెత్వాని కేసులో అరెస్ట్ అయిన పీఎస్ఆర్ పై ఇప్పుడు మరో కేసు నమోదైంది. దీంతో ఆయన ఇప్పుడల్లా బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉండగా గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం సీనియర్ అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం జెత్వాని కేసులో రిమాండ్ గా ఉన్న ఆయన విచారణకు సహకరించడం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసులో ఆయన్ను మరోసారి రిమాండ్ కోరుతారా ? లేదంటే గ్రూప్ -1 కేసులో అరెస్ట్ చూపిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన విషయంలో కూటమి సర్కార్ చాలా సీరియస్ గా ఉండటంతో ఇప్పట్లో ఆయన విడుదల అయ్యే అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు.
మరోవైపు, వైసీపీ పీరియడ్ లో జగన్ , సజ్జల ఆదేశాలతో పని చేసినా పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఆ పార్టీ నుంచి కనీస సానుభూతి లభించలేదు. జెత్వాని కేసులో పీఎస్ఆర్ అరెస్ట్ ను వైసీపీ నేతలు ఖండించే సాహసం కూడా చేయలేదు. చేస్తే ఏం జరుగుతుందో వారికి తెలుసు. కనీసం ఇప్పుడైనా వైసీపీ లీడర్లు పీఎస్ఆర్ పై సానుభూతిని ఒలకబోస్తారా? అంటే జగన్ గురించి తెలిసిన వారు మాత్రం అబ్బే అదేం ఉండదని తేల్చి చెబుతున్నారు.