అప్పన్న చందనోత్సం సందర్భంగా నిజరూప దర్శనం కోసం భక్తులు అర్థరాత్రికే తండోపతండాలుగా తరలి వచ్చారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అదే సమయంలో భారీ గాలి వాన వచ్చింది. క్యూలైన్ల వద్ద ఉన్న ఓ గోడ ఈ గాలి వాన కారణంగా కూలిపోయి భక్తులపై పడింది. ఆ శిధిలాల కింద చిక్కుకుని భక్తులు చనిపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎనిమిది మంది చనిపోయినట్లుగా గుర్తించారు.
సింహాచలం అప్పన్న చందనోత్సవానికి లక్షల మంది తరలి వస్తారు. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తారు. అయితే గోడను ఆనుకుని ఉన్న క్యూలైన్ .. ఆ గోడ నిర్మాణ లోపాలు, ప్రకృతి విపత్తు కారణంగా ప్రమాదం సంభవించి భక్తుల ప్రాణాలు పోవడానికి కారణం అయింది. ఘటన అర్థరాత్రి పూట జరిగింది. వెంటనే సహాయచర్యలు ప్రారంభించారు. నిజానికి ఇలాంటి అపశృతులు జరగకుండా ఉండటానికే పక్కా ఏర్పాట్లు చేశారు.
ఆ గోడ వద్ద భక్తులు ఎప్పుడూ ఉండరు. కేవలం చందనోత్సవం రోజునే అంత రష్ ఉంటుంది. అదే రోజు గాలివాన రావడం.. గోడ కూలడం అంటే ఎంత దురదృష్టం వెంటాడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అసలు ఆ గోడ.. గాలి వానకు ఎలా కూలిందో.. విచారణ చేయాల్సి ఉంది. ఎవరు నిర్మించారు.. కాంట్రాక్టర్ ఎవరు.. ఎంత నాసిరకంగా నిర్మించారో విచారణ చేసి… ఆ కాంట్రాక్టర్ పైనే ఎనిమిది మంది ప్రాణాలు తీసిన కేసులు పెట్టాల్సి ఉంది.
ఇటీవలి కాలంలో ఆలయాలకు భక్తులు ఊహించని విధంగా పోటెత్తుతున్నారు. ఫలితంగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతిలో .. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం తొక్కిసలాట జరిగింది. దానిపై విచారణ జరుగుతోంది. ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది.