ప్రిలాంచ్ పేరుతో మధ్యతరగతి ప్రజల కలల్ని దోపిడీ చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వందల కోట్లకు చేసిన మోసాల గురించి కేసులు నమోదయ్యాయి. తాజాగా త్రిపుర కన్ స్ట్రక్షన్స్ అనే సంస్థ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.
నాలుగేళ్ల కిందట మూడు వందల మంది ఇళ్ల కొనుగోలుదారులు, ఇన్వెస్టర్ల నుంచి త్రిపుర కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయించింది. మూడు నుంచి ఆరు నెలల్లో హెచ్ఎండీఏ అనుమతి వస్తుందని చెప్పారు. తర్వాత వెంటనే నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. కానీ ఇప్పటివరకూ అనుమతి తెచ్చుకోలేకపోయారు. దీంతో బాధితులు మాదాపూర్లోని సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రివర్స్ లో త్రిపుర కన్స్ట్రక్షన్స్ సంస్థ వీరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంటే డబ్బులు కట్టి పోలీసు కేసులు కూడా పెట్టించుకోవాల్సి వస్తోంది.
నాలుగేళ్ల నుంచి తమ వద్ద సొమ్ము తీసుకుని.. ప్రాజెక్టు గురించి చెప్పినమాటే చెబుతుండటంతో విసిగిపోయిన కొనుగోలుదారులు డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరుతున్నారు. కేసులు పెడితే కోర్టుల్లో చూసుకుందామని అంటారని భయపడుతున్నారు. కోర్టులు, కేసుల దాకా వెళ్తే ఎప్పటికీ తేలవు. అందుకే.. ఎలాగోలా చచ్చినోడికి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నంతగా అయినా వసూలు చేసుకోవాలని అనుకుంటున్నారు. వారి నిస్సహాయతతో రియల్ ఎస్టేట్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు.