* మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకున్న కృష్ణా డెల్టా!
* కృష్ణవేణి గడపతొక్కడానికి మూడోసారి గోదావరి నిరాకరణ!!
కృష్ణానది నీరు లేక అల్లాడిపోతోంది. గోదావరి వరదతో ఉప్పొంగుతోంది. పట్టిసీమ నుంచి కృష్ణా నదికి నీటి ప్రవాహం మళ్ళీ నిలచిపోయింది. ఇలాజరగడం ఇదిమూడోసారి. కృష్ణాగోదావరి నదుల అనుసంధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత తొందరపడిపోతున్నారో పనిలో అంత ఆలస్యమౌతోంది. నిర్మాణలోపాల వల్ల వరుసగా మూడోసారి తలఎత్తిన ఈ సమస్య ”మబ్బుల్లో నీరు చూసి కృష్ణాడెల్టా రైతులు ముంత ఒలకబోసుకున్నట్టు అయింది.
10వ తేదీ నాటికి పట్టిసీమ నీరు కృష్ణా నదికి వచ్చి చేరుతుందని నారుమడులు పోసుకోవచ్చని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నీరొస్తుందనే ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజీలో ఉన్న నీటిని కాలువలకు వదులుతున్నారు. మోటార్లతో కాల్వలు తోడి నారుమడులు పోసుకునేందుకు ఈనీరు ఉపయోగపడుతోంది. ఇపుడు ఒకవైపు బ్యారేజీలో నీరు అయిపోతోంది. గోదావరి నీరు ఎప్పుడు వస్తూందో తెలియని పరిస్ధితి.
వరదొచ్చిన సమయంలోనే నీటిని కృష్ణా నదికి మళ్లిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. కానీ ఆ వరద సముద్రం పాలవుతోంది. అంతేతప్ప పట్టిసీమ ద్వారా కృష్ణానదికి ఏమాత్రం చేరలేదు. ”నదీ అనుసంధానం”లో నిర్మాణ వైఫల్యాలే ఇందుకు మూలం!
మొదటిసారి గోదావరి-కృష్ణా అనుసంధాన సమయంలో పశ్చిమగోదావరి జిల్లా జానంపేట వద్ద తమ్మిలేరుపై వంతెన కుప్పకూలిపోయిం ది. వెంటనే నీటి సరఫరాను నిలిపేశారు.
రెండో సారి గత ఆగస్టు 17 న తేదీన రెండోసారి గోదావరి నీటిని అనివార్యంగా ఆపేశారు. అంతకుముందు రోజున విజయవాడ వద్ద ఫెర్రీ సమీపాన సంగమం పేరిట కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశారు. దీనికి టిడిపి, బిజెపి నుండి నాయకులు హాజరయ్యారు. అపుడు పట్టిసీమ పంపులు పని చేయక పోవడంతో తాడిపూడి లిఫ్టు నుండి 600 క్యూసెక్కుల నీటిని కాలువలోకి మళ్లించారు. పోలవరం కుడి కాలువ ద్వారా వస్తున్న నీటిని ఎక్కడికక్కడ ఆపేసి కట్టలు పోశారు. నీటి విడుదలకు ముందు రోజుల్లో గ్రామాల వారీగా అడ్డుకట్టలు తొలగించి పెద్దఎత్తున పూజలూ చేశారు. ఈ మధ్యలో ఉన్న సుమారు 45 వాగులు, వంకల నీటిని కలిపే శారు. ప్రారంభ సమయానికి 44 చోట్ల ఇన్లెట్లు, 41 చోట్ల డైవర్షన్ రోడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. సమయం లేకపోవడంతో తాత్కాలికంగా నీటి మళ్లింపు నకు ఏర్పాట్లు చేశారు. వాటి ద్వారా వచ్చిన నీటిని గోదావరి కృష్ణా అనుసంధానంగా ప్రకటించారు. మరునాడే నీటిని నిలిపేశారు. ఆ సమయంలో నీటిని వదిలిన కొద్ది కాలంలోనే పెదవేగి మండలం జానం పేట వద్ద వంతెన కూలిపోయింది. దీనికి రిపేర్లు పేరుతో నీటిని నిలిపేశారు.
మూడోసారి నాలుగురోజుల క్రితం పట్టిసీమ మోటార్లను ఆన్‌చేసి నీటిని విడుదల చేశారు. ఆసమయంలో నీటినే చూస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్వేగానికి లోనయ్యారు కూడా. పట్టిసీమ పధకంలో పని చేసిన జలవనరుల శాఖ ఇంజనీర్లకు సిబ్బందికి ఒక అదనపు ఇంక్రిమెంటు ప్రకటించారు.
అయితే,ఆతరువాత పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద గట్టుకు రంధ్రం పడింది దీంతో వెంటనే నీటి సరఫరాను నిలిపేశారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో రెండు అండర్ టన్నెళ్ళ నిర్మాణం, మరో ఆక్విడెక్ట్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. మూడు వంతెనల నిర్మాణమూ మధ్యలోనే ఉంది.
రంధ్రం పడిన ప్రాంతం పట్టిసీమకు 14వ కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఇంకా 160 కిలోమీటర్లు నీరు రావాల్సి ఉంది.
పులిచింతలలో రెండు టిఎంసిల నీరు నిల్వ ఉన్నా, అది ముందు జాగ్రత్త చర్యగా పుష్కరాల కోసం నిల్వ చేసి ఉంచారు. గోదావరి పుష్కరాలకు కూడా నీరు లేకపోవడంతో సీలేరు నుంచి 5 టిఎంసిల నీరు తెచ్చి పుష్కరాల క్రతువు పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా పట్టిసీమ నుంచి గోదావరి నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోకపోగా మూడుసార్లు ప్రారంభమైనా నీరు చేరని మొత్తం తతంగం చిరాకు పుట్టించే కామెడీ షోగా మారిపోయింది.