ఎన్టివి నుంచి నిష్క్రమణ, సాక్షిలో నియామకం మధ్య కాలంలో తనను పిలవడానికి అన్ని ఛానళ్లు భయపడ్డాయని సీనియర్ మీడియా మిత్రులు కొమ్మినేని శ్రీనివాసరావు ఆరోపించడంపై నేను అభ్యంతరం తెలిపాను. ఈ మేరకు నా వెబ్సైట్లో పెట్టిన పోస్టింగును వేలమంది చూశారు. చాలా మంది ఆహ్వానించారు . అయితే కొందరు అపరిపక్వతతోనూ నా ముఖ్యమైన వ్యాఖ్యను జీర్ణించుకోలేక షరా మామూలుగా దాడులకు దిగారు. ఇవన్నీ నాకు కొత్తేమీ కాదు. నిజానికి కొమ్మినేని నా దీర్ఘకాల మిత్రులు. మా కాంబినేషన్‌ను కూడా ప్రేక్షకులు బాగా స్వీకరిస్తారు. చాలా చోట్ల నాతో చెబుతుంటారు. ఆయన ఎన్టివి నుంచి నిష్క్రమించడానికి దారితీసిన రాజకీయ ఒత్తిళ్లపై చాలా చర్చనే జరిగింది. మీడియాలో జోక్యాలు ఒత్తిళ్లు ఇదే మొదటి సారి కాదు, చివరి సారి కాదు గనక పెద్ద ఆశ్చర్యం లేదు. తను. సాక్షిలోకి వచ్చాక తన కార్యక్రమంలో పాల్గొనడం ఇంకా కుదరలేదు గాని ఈ శుక్రవారం వెళ్లవచ్చు. ఈ లోగా అనుకోకుండాే యూ ట్యూబ్‌లో ఆయన ఇంటర్వ్యూ భాగాలు కొన్నిచూశాను. అన్నీ చూడలేదు. కారణం స్థూలంగా అవన్నీ చాలా కాలంగా అనుకుంటున్నవే. నేను చూసిన మేరకు ఇంటర్వ్యూలో ఒక భాగం అభ్యంతరం అనిపించింది. అదే ఇతర చానళ్లపై వ్యాఖ్య లేదా విమర్శ. తన తొలగింపునకై ఒత్తిడి చేసిన వారెవరో సూటిగా చెప్పడానికి ఆయన సిద్ధంగా లేరు. పరిస్థితుల రీత్యా దాన్ని అమలు చేసిన యాజమాన్యాన్ని విమర్శించకూడదని భావిస్తున్నారు. ఇలాటి క్లిష్ట దశలో తనను ఆదరించి అవకాశమిచ్చిన జగన్‌కు మరీమరీ కృతజ్ఞతలు చెబుతున్నారు. తను అంతకు ముందు ఉద్యోగం చేసిన ఈనాడు అధినేత రామోజీరావు గురించీ మంచి మాటలు చెప్పారు. ఇన్ని చేసిన మిత్రుడు కొమ్మినేని తన నిష్క్రమణ నూతన నియామకం మధ్య కాలంలో మిగతా ఛానళ్లు ‘భయపడి’ పిలవలేదని ఆరోపించడం బాగాలేదు. భయపడ్డారని అనడం సరికాదని ఆయనే కొంత సర్దుకున్నా ఇక్కడ సమస్య పదం కాదు. ఆ ఆలోచన. మాలాటి వాళ్లం అవకాశం వచ్చినప్పుడల్లా రెండు రాష్ట్రాలోనూ నచ్చని మీడియాపై వత్తిళ్లు గాని ఛానళ్ల నిలిపివేత కాని సరైంది కాదని చెబుతూనే వున్నాం. మొన్న కర్నూలు వెళితే అక్కడ స్థానికంగా వున్న సీమ ఛానెల్ వైర్లు కత్తిరించడం చూసిన తర్వాత ఇవన్నీ కలిపి మీడియాతో మాట్లాడాను. దాన్ని ఒక అగ్రశ్రేణి పత్రిక ఒక్కటంటే ఒక్క వాక్యం అది కూడా టేబులాయిడ్లో ఇచ్చి సరిపెట్టింది. అంత చిన్న వార్త నా నలభై ఏళ్ల పాత్రికేయజీవితంలో చూళ్లేదు. తమాషా ఏమంటే వారి సంస్థలపై వైఎస్ ప్రభుత్వం కేసులు పెట్టినప్పుడు మరో పత్రిక ఆంధ్రజ్యోతిలోని నా కాలమ్ గమనంలో వివరంగా రాశాను,వారు వేశారు కూడా! సరే ఎవరి పద్దతి వారిది. తెలుగు ఛానళ్లలోనూ పత్రికలలో నాకూ చాలా అనుభవాలున్నాయి. ఒకప్పుడు నాకు సమయం దొరక్కపోతే చర్చనే వాయిదా వేసుకున్న, ఆ కార్యక్రమ నిర్వహణ చేపట్టవలసిందిగా రెండు మూడు సార్లు ఆహ్వానించిన ఒక జాతీయ గొలుసుకట్టు ఛానల్‌కు ఇప్పుడు నా వూసే నచ్చడం లేదు.అది వారి ఇష్టం. ఇంతకు ముందే చెప్పినట్టు వారి సంస్థలపైన దాడి జరిగినప్పుడు- కొందరు పాత్రికేయ నేతలు కూడా వంతపాడుతున్నప్పుడు నేను నిశితంగా విశ్లేషించాను. అదంతా గతం. కనుక కొమ్మినేని వంటి అనుభవజ్ఞుడు ఇతర ఛానళ్లు తనను పిలవకపోవడం అపరాధమైనట్టు ఏ పదాలతోనైనా సరే ఆరోపించడం అసంబద్దం. అసలు ఈ సమస్య వచ్చాక కొంతకాలం విదేశాలకువెళ్లారు. . సాక్షిలో చేరిపోతారనే వూహాగానాలను ఖండించలేదు. అలా ఒక సంపాదకుడు మధ్యంతర దశలో వున్నప్పుడు ఇతరులు పిలిచి ఇబ్బంది పెట్టడం ఎలా కుదరుతుంది? అసలు అంత ప్రాధాన్యత ఇవ్వాలని అవి అందరూ అనుకోకపోవచ్చు. ఇది హిందూ సంపాదకుడు సిద్ధార్థవరద రాజన్ తొలగింపు లాటి సమస్య కాదు. లేదు విద్యుత్ ఉద్యమ సమయంలో మిత్రులు జి.శ్రీరామమూర్తిని కేవలం రాతల కారణంగా తొలగింపచేసిన తీరు కాదిది. రెండు బలమైన పాలకవర్గాల మధ్య వైరం ఫలితం. తర్వాత కొనసాగింపు కూడా దానికి పూర్తి అనుగుణంగానే వుంది. కనుక ఇందులో ఇతరులను అనుకోవడానికి ఆస్కారమెక్కడిది? మిత్రుడు కొమ్మినేని తను నిష్పక్షపాతంగా వుంటానని వుండాలని భావిస్తారు గనక పరిణతి కలవారు గనక ఈ అనౌచిత్యాన్ని స్నేహపూర్వకంగా ప్రస్తావించాను. ఆయనపైనో లేక జగన్‌పైనో అభిమానం వున్నవారు ఈ మాత్రానికే నాపై ధ్వజమెత్తడం అర్థం లేని విషయం. ఇలాటి అసహనం వద్దనే అనుభవాలన్నీ చెబుతున్నాయి. అసలైన పాత్రధారులనూ సూత్రధారులనూ కాదని సోదర చానళ్లపైనా సంపాదక యాజమాన్యాలపైన విమర్శలెందుకన్నదే నా పాయింటు. 360 మిత్రులతోనూ దాన్ని పంచుకోవాలని ఇది రాశాను.