జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కారణం..భద్రతాదళాల చేతిలో ఉగ్రవాది మరణించడం. ఉగ్రవాది హతమయితే అందుకు సంతోషించవలసిన ప్రజలు ఆందోళన చేస్తున్నారెందుకు? అంటే కాశ్మీర్ లో వేర్పాటువాదం చాపక్రింద నీరులా వ్యాపించి ఉండటమేనని చెప్పకతప్పదు. మరి అక్కడ ప్రభుత్వం ఏమి చేస్తోంది? అంటే ఆ వేర్పాటువాదులకే మద్దతు పలుకుతోందని చెప్పక తప్పదు. మరి కేంద్రప్రభుత్వం చూస్తూ ఎందుకు ఊరుకొంది? అంటే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకే అని చెప్పుకోవలసి ఉంటుంది. ఇదంతా చీమ-ఏడు చేపల కధలా ఉన్నప్పటికీ, వాస్తవం మాత్రం ఇదే. బహుశః అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకు కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల గురించి గట్టిగా మాట్లాడటం లేదేమో? అదే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ఖండ్ రాష్ట్రాలలో అయితే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లంఘనలకి పాల్పడుతున్నాయంటూ చాలా హడావుడిగా రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలన విధించేస్తుంటారు. మరి కాశ్మీర్ లో ఇంత అల్లకల్లోలం జరుగుతున్నా అటువంటి ఆలోచన ఎందుకు చేయడం లేదు అంటే కారణం అదే… మహబూబా ముఫ్తీ ప్రభుత్వంలో భాజపా భాగస్వామిగా ఉండటమే అని అనుకోవలసి ఉంటుంది.
ఒకవేళ శాంతిభద్రతల కారణంగా ఆమె ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించినట్లయితే, ఆమెతో బాటు భాజపా కూడా ఎలాగూ అధికారం కోల్పోతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు, పాకిస్తాన్ ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి. అప్పుడు ఆమె కూడా వేర్పాటువాదులతో కలిసి మోడీ ప్రభుత్వాన్ని నిందించడం మొదలుపెడతారు. అందుకే మహబూబాపై భారం వేసి మోడీ మౌనంగా చూస్తుండిపోయారేమో? ఆమె కొన్ని రాజకీయ శక్తులు కాశ్మీర్ లో సమస్యలని సృష్టిస్తున్నాయని అన్నారు. అవి ఏ పార్టీకి..దేశానికి చెందిన శక్తులో వాటిని ఆమె ఎందుకు అదుపుచేయలేకపోతున్నారో ఎవరికీ తెలియదు.