తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ‘ఆకర్ష’ పాలసీ!
”టిడిపి నుంచైనా సరే పనికొస్తే తీసుకొచ్చేయండి”
”తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేని తెలంగాణాలో” మొదటి స్ధానానికి పెరగాలని బిజెపి నిర్ధారణకు వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సొంత బలం పెంచుకోడానికి భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశంతో మొహమాటాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాని తెలిసింది. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ కోర్ కమిటీలతో సమావేశమైన అనంతరం బిజెపి అధ్యక్షు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి లక్ష్యాలు సాధించడానికి వ్యూహాలు రూపొందించారు.
తెలుగుదేశం పట్ల అసంతృప్తి ఉన్న ఏనాయకులనైనా బిజెపిలో చేర్చుకుని గౌరవపూర్వకమైన, ప్రతిష్టాత్మకమైన బాధ్యతలు, పదవులు అప్పగించాలని అమిత్ షా రెండు రాష్ట్రాల బిజెపి నాయకులకూ క్లియరెన్సు ఇచ్చారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వారు ఎడాపెడా చేరిపోయిన తెలుగుదేశంలో మొదటి నుంచీ వుండి గుర్తింపుదొరకని నాయకులను దృష్టిలో వుంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒక సారి చేరిపోయాక వారిని పట్టించుకోకుండా వదిలిపెట్టే తెలుగుదేశం లా కాకుండా పార్టీలోకి వచ్చిన వారి శక్తి సామర్ధ్యాల మేరకు బాధ్యతలూ గౌరవాన్నీ ఇవ్వాలని కూడా అమిత్ షా చెప్పారని తెలిసింది. తెలుగుదేశం నుంచి మాత్రమే కాక కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ మొదలైన ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని కూడా చేర్చుకోవాలని నిర్ణయించారు.
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ఎక్కువగా తీసుకోవాలని, అందుకు టిడిపితో సంబంధాల గురించి ఆలోచించే పని లేదని సూచించారు. కొత్తగా చేరేవారికి బాధ్యతలు అప్పగించాలని, పాత వారు కొత్తవారిని అడ్డుకుంటున్నారన్న ఫిర్యాదులను, ఇకపై సహించబోమని కూడా పార్టీ అధ్యక్షుడే స్పష్టం చేశారని చెబుతున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంతో సమన్వయం కోసం ప్రస్తుతం ఉన్న కమిటీని ప్రక్షాళన చేసి, తానే స్వయంగా కమిటీలో సభ్యుల పేర్లు సూచిస్తానని అమిత్ షా చెప్పారని సమాచారం. ప్రస్తుత సమన్వయ కమిటీ సభ్యులు పార్టీ విస్తరణ, ప్రయోజనాల కోసం ఒత్తిడి చేయడం లేదని, పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న నష్టాన్ని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారన్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకునే అమిత్షా ఈ ఆదేశాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు అయోమయంగా ఉన్నారని, టీఆర్ఎస్లో చేరడానికి వీల్లేని నేతలను గుర్తించి వారిని పార్టీలోకి తీసుకోవాలని ఆదేశించడంతో..బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కసరత్తు ప్రారంభించారు. ‘అవకాశం ఉన్న చోట్ల అన్ని పార్టీల నేతలను చేర్చుకోండి. ఈ విషయంలో టిడిపిని ఏమీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఆ పార్టీకి తెలంగాణలో ఉనికిపోయింద’ని అమిత్ షా విస్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. ‘
బిజెపి ప్రభుత్వ విధానాలు, మోదీ పనితీరును మెచ్చిన ఎవరైనా పార్టీలోకి రావచ్చు. వారిని ఆహ్వానిస్తున్నాం. అందుకు టిడిపి కూడా మినహాయింపుకాదు అన్నదే తెలుగురాష్ట్రాల్లో ఇక బిజెపి విధానం!