వైకాపా తరపున మొట్టమొదటిసారిగా రాజ్యసభలో అడుగుపెడుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఫిరాయిమ్పులని అరికట్టేందుకు చట్ట సవరణలు చేయాలని కోరుతూ రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. ఫిరాయింపుల చట్టంలోని ఆర్టికల్ 361బి కి సవరణలు చేసి మరింత కటినతరం చేయాలని కోరనున్నారు. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధికి వేరే పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో ఏ పదవి దక్కకుండా ఉండేవిధంగా చట్టంలో నిబంధన విదించాలని తన బిల్లు ద్వారా కోరబోతున్నారు. పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధుల పదవులు పార్టీ మారడంతోనే కోల్పోవడమే కాకుండా, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనే అధికారం ఎన్నికల సంఘానికి కట్టబెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఇదివరకు డిమాండ్ చేశారు కనుక ఆ నిబంధన కూడా చేర్చమని విజయసాయి రెడ్డి తన బిల్లులో కోరే ఉండవచ్చు.
అన్ని పార్టీలుఫిరయింపులని వ్యతిరేకిస్తున్నప్పటికీ, దాని కోసం చట్ట సవరణ చేసేందుకు సహకరించకపోవడం వలననే నేటికీ ఆ చట్టం అంత లోపభూయిష్టంగా ఉంది. కనుక ఇప్పుడు కూడా ఇతర పార్టీలు ఆ బిల్లుకి మద్దతు ఇస్తాయని ఆశించలేము. ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఫిరాయింపజేసిన తెదేపా, తెరాసలు అందుకు అంగీకరించకపోవచ్చు. దేశంలో వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా అదే కారణంతో బిల్లుకి మద్దతు ఈయకపోవచ్చు. కానీ ఈ బిల్లు ఆమోదం పొంది ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేయగలిగితే రాజకీయ నేతలకి కొంత క్రమశిక్షణ అలవడుతుంది. అవకాశవాద రాజకీయాలు తగ్గవచ్చు. పార్లమెంటు సమావేశాలు ఈనెల 18 నుంచి ఆగస్ట్ 13 వరకు సాహుతాయి.