మహారాష్ట్రలో మజ్లీస్ పార్టీకి ఎన్నికల కమీషన్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ పాల్గొనకుండా నిషేధం విదించింది. ఆ పార్టీ తాలూకు ఆడిట్ చేసిన అకౌంట్లు సకాలం సమర్పించనందుకు నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. సకాలంలో ఆడిట్ నివేదికను సమర్పించకపోతే పార్టీ గుర్తింపు రద్దు చేస్తామని గతంలోనే ఒకసారి మజ్లీస్ పార్టీకి నోటీసులు కూడా పంపామని కానీ ఆ పార్టీ తమ నోటీసుని పట్టించుకోకపోవడం చేతే నిషేధం విధించవలసి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. అయితే ఎన్నికల కమీషన్ కోరిన అన్ని పత్రాలని తాము అందజేశామని, అయినా ఈసీ తమపై ఎందుకు ఇటువంటి చర్య తీసుకొందో తెలియడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే వారి పఠాన్ అన్నారు. ఈసీ నుంచి లేఖ అందిన తరువాత స్పందిస్తామని అన్నారు.
ఎన్నికల సంఘం పార్టీపై నిషేధం విధించింది కనుక మజ్లీస్ పార్టీ తరపున పోటీ చేయదలచుకొన్నవారందరూ స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయవలసి ఉంటుంది. హైదరాబాద్ లో ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడినప్పుడు వారికి న్యాయసహాయం చేస్తానని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించినందుకు, మజ్లీస్ పార్టీ గుర్తింపు రద్దు చేసి, అసదుద్దీన్ ఓవైసీని జైలుకి పంపాలని తెలంగాణా భాజపా నేతలు డిమాండ్ చేశారు. బహుశః ఆ కారణంగానే కేంద్రప్రభుత్వం ఎన్నికల కమీషన్ పై ఒత్తిడి చేసి మజ్లీస్ పార్టీపై నిషేధం విదించిందా? లేక మహారాష్ట్రలో ముస్లిం జనాభా ఎక్కువున్నందున వారి ఓట్లన్నీ మజ్లీస్ పార్టీకే పడే అవకాశం ఉంటుంది కనుక భాజపా, శివసేనల ఒత్తిడితోనే ఈ సాకుతో నిషేధం విధించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమయినప్పటికీ మజ్లీస్ పార్టీకి ఇది చాలా గట్టి ఎదురు దెబ్బగానే భావించవచ్చు కానీ ఇదే కారణంగా మజ్లీస్ పార్టీకి చాలా సానుకూల అంశంగా కూడా మారవచ్చు. దానిపట్ల ముస్లిం ప్రజలలో సానుభూతి ఏర్పడితే అది నిలబెట్టిన స్వాతంత్ర్య అభ్యర్ధులకే ఓట్లు పడే అవకాశం కూడా ఉంది. కనుక నిషేధం ఎత్తివేసే అవకాశం లేనట్లయితే కేంద్రప్రభుత్వం, భాజపా, శివసేనలే ఎన్నికల కమీషన్ పై ఒత్తిడి తెచ్చి తమ పార్టీపై నిషేధం విధింపజేశాయని, దేశంలో ముస్లింల పట్ల వివక్ష కొనసాగుతోందని మజ్లీస్ పార్టీ గట్టిగా ప్రచారం చేసుకొని లభ్ది పొందే ప్రయత్నం చేయవచ్చు.